సల్మాన్ ఖాన్ కి బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈద్ వస్తుంది అంటే సల్మాన్ ఖాన్ సినిమాల సందడి మొదలైపోతుంది. రంజాన్ కి కొత్త సినిమా రిలీజ్ చేయడమనేది సల్మాన్ ఖాన్ కి సెంటిమెంట్ గా మారిపోయింది. అయితే కొన్నాళ్లుగా సల్మాన్ ఖాన్ నటించిన సినిమాలేవీ ప్రేక్షకులని మెప్పించడం లేదు. అందులోను హిందీ సినిమాల పరిస్థితి ప్రస్తుతం అంతంతమాత్రంగా ఉంది. ప్రేక్షకులు హోప్స్ పెట్టుకోవడం, ఆ అంచనాలు అందుకోలేక స్టార్ హీరోలు చతికిల పడడమనేది రొటీన్ గా మారిపోయింది.
సౌత్ సినిమాల వలే నార్త్ సినిమాల్లో కంటెంట్ బలంగా ఉండాలని నార్త్ ఆడియన్స్ కోరుకుంటున్నారు. కానీ వారి కోరిక ఆ సినిమాలు నిలబెట్టలేకపోతున్నాయి. దానితో మొదటి రోజే పెద్ద సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
ఇక సల్మాన్ ఖాన్ ఈ రంజాన్ కి కిసి కా భాయ్ కిసి కా జాన్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా, యాక్షన్ మూవీలా కనిపించిన ఈ చిత్రం మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ తెస్తుంది అనుకుంటే.. సల్మాన్ ఖాన్ కి ఈ చిత్రం ఓపెనింగ్స్ పరంగా షాకిచ్చింది. రంజాన్ సెంటిమెంట్ గా విడుదలవుతున్న సల్మాన్ సినిమాలకు రికార్డ్ ఓపెనింగ్స్ రావడమేది చూస్తూనే ఉన్నాము. 2010 రంజాన్ కి విడుదలైన సల్మాన్ దబాంగ్ ఓపెనింగ్ డే 14.50 కోట్లు కలెక్షన్స్ తీసుకొచ్చింది. 2011 ఈద్ కి బాడీ గార్డ్ 21.60 కోట్లు కొల్లగొట్టింది. భారీ అంచనాల నడుమ 2012 లో రంజాన్ కి వచ్చిన ఏక్తా టైగర్ 32.93 కోట్ల కలెక్షన్స్ తో రికార్డ్ క్రియేట్ చేసింది.
2014 ఈద్ కి రిలీజ్ అయిన కిక్ 26.40 కోట్లు ఓపెనింగ్స్ తీసుకురాగా.. 2015 లో భజరంగి భాయీజాన్ 27.25 కోట్లు కొల్లగొట్టింది. 2016 సుల్తాన్ మూవీ 36.54 కోట్ల తో రికార్డ్ ఓపెనింగ్స్ సాధించింది. 2017 లో ట్యూబ్ లైట్ 21.25 కోట్లు ఓపెనింగ్స్ తెచ్చింది. 2018 లో రేస్ 3కి 29.17 కోట్ల కలెక్షన్స్ ఓపెనింగ్ డే వచ్చాయి. 2019 రంజాన్ కి భరత్ 42.30 కోట్ల సెన్సేషనల్ ఓపెనింగ్స్ రాబట్టింది. ఇక గత రెండేళ్లుగా రంజాన్ కి తన చిత్రాలని విడుదల చెయ్యని సల్మాన్ ఖాన్ ఈ ఏడాది 2023 రంజాన్ కి కిసి కా భాయ్ కిసి కా జాన్ చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చాడు.
అయితే ఈ చిత్రానికి పూర్ ఓపెనింగ్స్ రావడం అందరికి అతిపెద్ద షాకిచ్చింది. కిసి కా భాయ్ కిసి కా జాన్ చాలా తక్కువగా మొదటిరోజు జస్ట్ 15.81 కోట్ల కలెక్షన్స్ మాత్రమే తీసుకురావడం ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపరిచింది.