సినిమా రివ్యూ : హలో మీరా
నటీనటులు : గార్గేయి ఎల్లాప్రగడ
డైలాగ్స్ : హిరణ్మయి కళ్యాణ్
సాంగ్స్ : శ్రీ సాయి కిరణ్
సినిమాటోగ్రఫీ : ప్రశాంత్ కొప్పినీడి
మ్యూజిక్ : ఎస్. చిన్నా
నిర్మాతలు : డా: లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల
కథ, కథనం, దర్శకత్వం : శ్రీనివాసు కాకర్ల
రిలీజ్ డేట్: 21-04-2022
తెరమీద అనేక పాత్రలు కదులుతూ ఆసక్తికర సంభాషణలతో, అద్భుతమైన మలుపులతో, రక్తి కట్టించే కథ ఉంటేనే ఆడియన్స్ సినిమాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న ఈ రోజుల్లో.. సింగిల్ కేరెక్టర్ తో సింపుల్ గా సినిమా చేసి ప్రేక్షకులముందుకు తీసుకురావొచ్చు అంటూ శ్రీనివాసు కాకర్ల చేసిన చిన్న ప్రయత్నమే హలో మీరా. గార్గేయి అనే అమ్మాయితోనే హలో మీరాని దర్శకుడు ఎలా నడిపించాడు, సింగిల్ కేరెక్టర్ తో ఆడియన్స్ ని ఎలా మెప్పించాడో సమీక్షలో చూసేద్దాం.
కథ:
కళ్యాణ్ అనే వ్యక్తిని మీరా(గార్గేయి) ప్రేమించి పెళ్లి చేసుకునేందుకు సిద్దమవుతుంది. మరో రెండురోజుల్లో మీరా పెళ్లి అనగా.. ఆమె జీవితంలో ఊహించని సంఘటన ఎదురవుతుంది. మీరా తన పెళ్లి పనుల్లో భాగంగా విజయవాడలో బిజీగా ఉంటుంది. మీరా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ సుధీర్ హాస్పిటల్‌లో చేరడంతో మీరా అతన్నిప్రేమించి మోసం చేసిందనే ఆరోపణలను ఎదుర్కొంటుంది. పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న ఆమె అప్పటికప్పుడు విజయవాడ నుంచి హైద్రాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు రావాల్సి వస్తుంది. విజయవాడ-హైదరాబాద్ కి మధ్యన జరిగిన ప్రయాణంలో మీరాకు ఎదురైన పరిస్థితులు ఏంటి? అసలు మీరా ఎక్స్ సుధీర్ ఎందుకు హాస్పిటల్లో చేరాడు? కళ్యాణ్ చివరికి మీరాని వివాహం చేసుకున్నాడా అనేది సింపుల్ గా కథ.
పెరఫార్మెన్సెస్:
ఇందులో పలు పాత్రల గురించి వివరించడానికి ఏమి ఉండదు.. మీరా పాత్ర తప్పితే ఎవరూ ఉండరు. జస్ట్ మీరా పాత్రలో గార్గేయి నటన గురించే మాట్లాడుకోవాలి. నవ్వించినా, ఏడిపించినా, మనలో ఆందోళనను కల్గించినా, భయానికి గురి చేసినా కూడా మీరా పాత్రతోనే అవుతుంది. అన్ని ఎమోషన్స్‌ను మీరా పాత్రలో గార్గేయి చక్కగా పలికించింది. మీరా తండ్రి వాయిస్ మాత్రమే వినిపిస్తుంది.
విశ్లేషణ:
హలో మీరా అంటూ దర్శకుడు కాకర్ల శ్రీనివాసు ఓ ప్రయోగాత్మక చిత్రానికి శ్రీకారం చుట్టాడు. దర్శకుడికి తోడు నిర్మాతలు కూడా లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల
అందరూ ప్రయోగం చేశారు. సింగిల్ కారెక్టర్‌తో సినిమాను నడిపించాలనుకోవడమే డైరెక్టర్ సాహసం. ఒంటరి ఆడపిల్లకి సమాజంలో ఎదురయ్యే పరిస్థితులు, అనుమానంతో అమ్మాయిలను ఎలా దూషిస్తారు.. అసలు అమ్మాయిలను ఇంట్లో తల్లి కూడా అర్థం చేసుకోకపోవడం వల్ల జరిగే పరిస్థితులు, తండ్రి అండగా ఉంటే అమ్మాయిలు ఎంత ధైర్యంగా ఉంటారు అనే విషయాలెన్నో ఇందులో చూపించారు. ప్రేమ పేరుతో ఎలాంటి మోసాలు జరుగుతాయి.. అమ్మాయిలను ఎలా వంచిస్తారు. అమ్మాయిలు అప్రమత్తంగా ఉండకపోతే ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి.. అసలు అమ్మాయి అంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎంతో ధృడంగా ఉండాలని సందేశాన్ని ఇస్తూ హలో మీరా సినిమాను మలిచాడు దర్శకుడు.
హలో మీరాలో కనిపించేది ఒక్క కేరెక్టర్ మాత్రమే. దాంతో సాగదీసిన సన్నివేశాలు లేవు. నిడివి తక్కువే. కేవలం గంటన్నరలో సినిమా ముగిసింది. సినిమాలో ప్లస్ పాయింట్ అదొక్కటే కాదు.. గార్గేయి నటన, ప్రశాంత్ కొప్పినీడి సినిమాటోగ్రఫీ.. స్క్రీన్ మీద ఉన్నది సింగిల్ క్యారెక్టర్ అనేది తెలియకుండా చేసింది. హైవే మీద డ్రోన్ షాట్స్, లాంగ్ షాట్స్, ఇంకా చాలా సన్నివేశాల్లో విజువల్స్ బావున్నాయి. చిన్నా నేపథ్య సంగీతం కూడా బావుంది. సాంగ్స్ సోసోగా ఉన్నాయి. దర్శకుడు శ్రీనివాసు కాకర్ల ఎంపిక చేసుకున్న కథాంశం, కథను నడిపిన తీరు బావుంది.
అయితే సింగిల్ కేరెక్టర్ అనేది ఒక్కోసారి ప్లస్ అయినా.. కొన్ని సమయాల్లో మైనస్ కూడా అయ్యింది. ప్రతిదీ ఫోన్ సంభాషణ కావడంతో కొన్నిసార్లు మొనాటనీ వస్తుంది. మధ్య మధ్యలో కొన్ని సంభాషణలు అంతగా ఆకట్టుకోవు. అయినప్పటికీ హలో మీరా ఆకట్టుకునే కథాంశమే.
రేటింగ్: 2.75/5