టాలీవుడ్ సినిమాల్లో ఇప్పుడు నయా ట్రెండ్ నడుస్తుంది. అది ఒక్కో ప్రాంతం యాసని పట్టుకుని హీరోలు బ్లాక్ బాస్టర్ హిట్స్ కొడుతున్నారు. ఎప్పటినుండో ఈ భాషా ట్రెండ్ నడుస్తున్నా.. హైలెట్ అయ్యింది మాత్రం సుకుమార్-రామ్ చరణ్ రంగస్థలం అప్పటినుండే. సుకుమార్ రామ్ చరణ్ తో గోదారి యాసని పలికించి.. చరణ్ రూపానికి, భాషకి లింక్ పెట్టి మెప్పించారు. నిజంగా చిట్టిబాబుగా చరణ్ పాత్ర అటు లుక్ విషయంలోనూ ఇటు భాషాపరంగా ప్రెకషకులని విపరీతంగా ఆకట్టుకుంది.
ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరవింద సమేతలో రాయలసీమ భాష పలికినా.. అది గట్టిగా ప్రేక్షకుల్లోకి వెళ్ళలేదు. కానీ పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ రాయలసీమ మాండలీకాన్ని వంటబట్టించుకుని మరీ అద్భుతంగా మాట్లాడాడు. నీ యవ్వ అంటూనే రాయలసీమ భాషలో చెలరేగిపోయాడు. రామ్ చరణ్ గోదారి భాషని ఎంచుకుంటే అల్లు అర్జున్ రాయలసీమ భాషని ఎంచుకున్నాడు.
ఇక ఇప్పుడు నాని. దసరా సినిమాలో పక్కా తెలంగాణ మాట్లాడాడు. తెలంగాణ భాషని లోతుగా విశ్లేషించి మరీ ఆ భాషని పట్టేసాడు. దసరా సినిమాలో పూర్తి తెలంగాణ యాసలో నాని అద్భుతంగా ఆకట్టుకుని తెలంగాణ ప్రజల మనసులు కొల్లగొట్టాడు. బలగం, డీజే టిల్లు ఇవన్నీ తెలంగాణ భాషతో తెరకెక్కిన సినిమాలే అయినా.. దసరా తెలంగాణ భాష నేపథ్యంలోనే తెరకెక్కి ప్రేక్షకుల్లోకి బలంగా వెళ్లి హిట్ అయ్యింది. అది కూడా రగ్డ్ అండ్ రా లుక్స్ తోనే.
చిట్టిబాబుగా రామ్ చరణ్, పుష్ప రాజ్ గా అల్లు అర్జున్, ధరణిగా నాని లుక్స్ విషయంలోనూ పోటీపడ్డారు. మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు బలమైన ప్రాంతాల్లో ముచ్చటైన భాషని ఎత్తుకుని డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ముగ్గురు హీరోలు మంచి హిట్స్ కొట్టారు.