బాలీవుడ్ వరసగా ప్లాప్ లు ఎదుర్కొంటుంది. అందులోను రీమేక్స్ అస్సలు వర్కౌట్ అవ్వడం లేదు. ఈఏడాది బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ పఠాన్ తప్ప చెప్పుకోదగ్గ చిత్రం లేదు. రణబీర్ కపూర్-శ్రద్ద కపూర్ నటించిన చిత్రం తు జూటి మే కక్కర్ సో సో టాక్ తోనే 100 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. ఇక తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన అలా వైకుంఠపురములో రీమేక్ షెహజాద హిందీలో అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇప్పుడు మరో రీమేక్ బాలీవుడ్ ని ముంచేసింది. తమిళనాట లోకేష్ కనగరాజ్ ని స్టార్ డైరెక్టర్ గా మార్చిన కార్తీ ఖైదీని బాలీవుడ్ లో అజయ్ దేవగన్ భోళాగా రీమేక్ చేసారు.
గత శుక్రవారం విడుదలైన అజయ్ దేవగన్ భోళా.. ఖైదీని యాజిటీజ్ గా రీమేక్ చెయ్యకుండా దానికి కాస్త మసాలా, కమర్షియల్ హంగులు జోడించడంతో నార్త్ ప్రేక్షకులు ఆ మార్పులని తిరస్కరించారు. మొదటిరోజు చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ దక్కించుకున్న భోళాకి వచ్చిన నెగెటివ్ టాక్ ఆ సినిమాని గట్టెక్కించడం ఇప్పుడు కష్టంగానే మారింది. ఒరిజినల్ ఖైదీని యధాతధంగా తెరకెక్కించినట్లయితే పరిస్థితి ఎలా ఉండేదో.. దానికి మసాలా కలపడమే ప్రేక్షకులకి నచ్చలేదు.
ఐటెం సాంగ్, తండ్రి కూతుళ్ళ ఎమోషనల్ బాండింగ్ బలంగా లేకపోవడం, అవసరం లేని హీరోయిన్ ఎంట్రీ, యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకోలేకపోవడం భోళా మునిగిపోవడనికి కారణంగా మారాయి. అసలు ఖైదీ చూసిన కళ్ళతో భోళా చూస్తే ఇదేం ఖర్మరా బాబు అంటున్నారట, ఇప్పుడు ఈ రీమేక్ కూడా దెబ్బేయ్యడంతో బాలీవుడ్ మరోసారి డల్ అయ్యింది.