చిరంజీవి కొడుకు అయితే.. ఆయనలా సక్సెస్ అవుతాడా?
మెగాస్టార్, పవర్ స్టార్ వారసత్వాన్ని కంటిన్యూ చేయగలడా?
మెగా అభిమానుల అభిమానాన్ని సాధించగలడా?
అసలు ఏముందని ఈ మెగా వారసుడిని ఆదరించాలి? అభిమానించాలి?
చిరు, పవన్‌లతో మెగా స్టార్‌డమ్ ముగిసినట్టేనా?.. రామ్ చరణ్ అరంగేట్రం సమయంలో వినిపించిన ప్రశ్నలివి. మరి వీటికి సమాధానం చెప్పాలా? అసలు ఈ ప్రశ్నలు సంధించిన వారి ముఖ చిత్రాలు ఇప్పుడెలా ఉన్నాయో ‘చూడాలని ఉంది’. ‘ఇంతింతై వటుడింతై’ అనేలా ‘చిరుత’నయుడి ప్రస్థానం ఇప్పుడు గ్లోబల్ స్థాయికి చేరింది. ప్రశ్నించిన నోటితోనే.. ప్రశంసల వర్షం కురిపించుకునే శిఖర స్థాయికి చేరి.. చిరుని మించిన చిరుతగా పేరొందిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విజయ పతాకాన్ని ఎగరవేస్తున్నారు.
2007 సెప్టెంబర్ 28.. మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ‘చిరుత’తో అడుగుపెట్టి.. ఆ పేరులానే చెలరేగిన ఓ సక్సెస్ ఫుల్ హీరో రామ్ చరణ్. ఆ సినిమాలో ఎంట్రీ సీన్‌లో ఫేస్‌కి అడ్డుగా ఉన్న తెర.. ఒక్కో మడత విప్పుతుంటే.. అప్పుడెవరికీ తెలియలేదు.. ఇండస్ట్రీకి ఇంకో రంకు మొగుడు అవుతాడని. ‘ఈ అడవి నాదే.. ఈ వేట నాదే’ అనేది కేవలం డైలాగ్ మాత్రమే అనుకున్నారు. ఆ తర్వాత తెలిసింది అందరికీ.. ఇది మెగా సామ్రాజ్యంలో చరణ్ సాగిస్తున్న వేట అని. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సక్సెస్‌ఫుల్ ఫ్యామిలీలు ఉన్నాయి.. సక్సెస్‌ఫుల్ హీరోలు ఉన్నారు. కానీ.. ఒక సక్సెస్‌ఫుల్ హీరో వారసత్వాన్ని అంతే గొప్పగా.. కాదు కాదు అంతకు మించి కంటిన్యూ చేసిన ఘనత మాత్రం ఈ మెగా పవర్ స్టార్‌కి మాత్రమే దక్కుతుంది.
1985 మార్చి 27న చెన్నైలో జన్మించిన రామ్ చరణ్.. దాదాపు 75 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రను కేవలం రెండో సినిమాతో తిరగరాస్తాడని.. ఎవరైనా ఊహించి ఉంటారా? కానీ చరణ్ అది చేసి చూపించాడు. ‘ఒక్కొక్క రికార్డ్ కాదు.. అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులని ఒకేసారి లేపి పక్కన పెట్టేశాడు’ తన రెండో సినిమాతో. దర్శకధీర రాజమౌళితో చేసిన ‘మగధీర’తో మొదలైన చరణ్ రికార్డుల పర్వం.. ఆ తర్వాత ‘ఆరెంజ్, రచ్చ, నాయక్, తుఫాన్, ఎవడు, గోవిందుడు అందరివాడేలే, బ్రూస్‌లీ’ వరకు పడి లేస్తూ.. నేడు అదే దర్శకుడితో ‘ఆర్ఆర్ఆర్’ రూపంలో గ్లోబల్ స్థాయికి చేరేంత వరకు.. చరణ్ కృషి, మొక్కవోని పట్టుదల ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. అయితే ఎన్ని సినిమాలు చేసినా.. ఎన్ని రికార్డులు కొల్లగొట్టినా.. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేసిన ‘రంగస్థలం’ మాత్రం ఈ మెగా హీరోకి ఎప్పటికీ ప్రత్యేకమే. తనలోని పూర్తి స్థాయి నటుడిని, తన బలాబలాలను చరణ్‌కి తెలియజేసిన చిత్రమిది. ఈ సినిమాలోని నటనతో రామ్ చరణ్ మ్యాన్ ఆఫ్ ద మాస్‌గా జనాల హృదయాలను కొల్లగొట్టాడు.
‘రంగస్థలం’ తర్వాత రామ్ చరణ్ ఇమేజ్, క్రేజ్ డబులయ్యాయి. అప్పటి వరకు చిరుతనయుడు ట్యాగ్‌ను దాటి తన ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోవాలనుకున్న చరణ్‌ను, ఆయనలోని నటనను పూర్తి స్థాయిలో బయటికి తీసిన చిత్రంగా ‘రంగస్థలం’ రామ్ చరణ్ కెరీర్‌లో నిలబడిపోతుంది. ఆ తర్వాత మొదలైన ఆర్ఆర్ఆర్ అలజడి.. సముద్రమంత స్థానాన్ని చరణ్‌కు జత చేసింది. ఇక్కడ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్ సమయంలో రాజమౌళి చెప్పిన ఓ మాటని గుర్తు చేసుకోవాలి. ‘చరణ్‌లో ఏదైనా చేయగల స్టామినా ఉంది.. కానీ ఆ విషయం చరణ్‌కు తెలియదు..’ ఇది రాజమౌళి స్టేట్‌మెంట్. సరిగ్గా ఇదే మాట పురాణాలలో ఒక చోట వినిపిస్తుంది. అదీ కూడా చిరంజీవి ఇష్టదైవం ఆంజనేయ స్వామి విషయంలో. ఆయన కూడా అంతే.. ఆంజనేయునికి ఉన్న బలం ఆయనకు తెలియదు.. అదే చరణ్‌కు వర్తిస్తుందీ అని రాజమౌళి చెప్పిన మాట ముమ్మాటికీ నిజం. అందుకు సాక్ష్యం.. ‘ఆర్ఆర్ఆర్’లో రామ్ చరణ్ ట్రాన్స్‌ఫర్మేషన్. ‘ఆర్ఆర్ఆర్’లో రామ్ చరణ్ నటన, అందులోని వేరియేషన్స్ గురించి గత కొంతకాలంగా వింటూనే ఉన్నాం. కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు.. గ్లోబల్ స్థాయిలో రామ్ చరణ్ నటన గురించి మాట్లాడుకుందీ అంటే.. అతని నటనాస్త్రం పవర్ అలాంటిది. రాజమౌళిలా దర్శకులందరూ దానిని వాడుకో గలిగితే.. గ్లోబల్ విజేతగా నిలిచి.. తెలుగు సినిమా స్థాయిని అగ్ర స్థానంలో అలానే నిలబెట్టడం చరణ్‌కి ఏమంత పెద్ద విషయమే కాదు. ఆ రోజు రావాలని ఆశిద్దాం.
మ్యాన్ ఆఫ్ ద గోల్డెన్ హార్ట్
మెగా పవర్ స్టార్ అని ఏ క్షణాన ట్యాగ్ ఇచ్చారో కానీ.. ఆ ఇద్దరిలోని లక్షణాలను పుష్కలంగా అందిపుచ్చుకున్నాడీ గ్లోబల్ స్టార్. నాన్నలోని సున్నితత్వం, బాబాయ్‌లోని ముక్కుసూటితత్వం కలగలిపినట్లు కనిపించే చరణ్.. ఆ ఇద్దరిలోని మానవత్వాన్ని మాత్రం.. ఆ ఇద్దరికంటే ఎక్కువగా ప్రదర్శించి మ్యాన్ ఆఫ్ ద గోల్డెన్ హార్ట్ అనిపించుకున్నారు. ఆ విషయం ఇండస్ట్రీలో జానీ మాస్టర్ నుంచి జబర్దస్త్ కమెడియన్స్ వరకు ఏ ఒక్కరిని అడిగినా ఇట్టే చెబుతారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి నిర్మాతగానూ సక్సెస్‌ఫుల్‌గా చరణ్ కొనసాగుతున్నారు. అలాగే ఫ్యామిలీకి ఆయన ఇచ్చే ఇంపార్టెంట్ ఏంటో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇక అభిమానులంతా బద్ద శత్రువులుగా భావించే నందమూరి ఫ్యామిలీతో ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో చరణ్ బాండింగ్ గురించి నందమూరి అభిమానులు సైతం మాట్లాడుకుంటారంటే.. అది చరణ్‌లోని గొప్పతనం. ఇలా ఒక్కటేమిటి? చరణ్ గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మైనస్‌లన్నింటినీ ప్లస్‌లుగా మార్చుకుంటూ అంచనాలకు అందనంతగా బౌండరీలను దాటి మరి క్రేజ్‌ను సొంతం చేసుకున్న, చేసుకుంటున్న ‘గేమ్ ఛేంజర్’ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆస్కార్ మాత్రమే కాకుండా.. ఈ సంవత్సరం రామ్ చరణ్‌కి మరింత మెమరబుల్‌గా ఉండబోతోంది. త్వరలోనే మెగా ఇంట సంబరాలు ఆకాశాన్ని తాకబోతున్నాయి. ఆ రోజు కోసం మెగా ఫ్యామిలీ, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మెగా ఫ్యామిలీ, మెగా అభిమానులు ప్రౌడ్‌గా ఫీలయ్యే ఈ గ్లోబల్ స్టార్.. ఇలాంటి ఆనందకరమైన పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. హ్యాపీ బర్త్‌డే టు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.