మంచు మనోజ్ భూమా మౌనికని పెళ్లి చేసుకోవడం మంచు ఫ్యామిలిలో ఎవరికీ ఇష్టం లేదు, ముఖ్యంగా మోహన్ బాబు కి అస్సలు ఇష్టం లేదు అంటూ మనోజ్ పెళ్లి విషయం బయటపడినప్పటినుండి మనోజ్ పెళ్లి తర్వాత వరకు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ మోహన్ బాబు మనోజ్ పెళ్లికి వచ్చి ఆశీర్వదించి మౌనికని దీవించడంతో అవన్నీ రూమర్స్ అని తేలిపోయినా.. అభిమానుల్లో ఎక్కడో అనుమానం అయితే అలానే ఉండిపోయింది.
తాజాగా మోహన్ బాబు బర్త్ డే స్పెషల్ గా మోహన్ బాబు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆయన రాజకీయ, సినీరంగ సంగతులే కాకుండా.. పర్సనల్ విషయాలతో పాటుగా.. కొడుకుల విషయము మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ పెళ్లి తనకి ఇష్టం లేదు అంటూ జరిగిన ప్రచారంలో నిజం లేదని ఆయన తెగేసి చెప్పారు. మనోజ్ తన మొదటి పెళ్లి రద్దయిన కొన్నాళ్ళకి నా దగ్గరకి వచ్చి డాడీ పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఆలోచించరా అన్నాను. లేదు డాడీ నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనుకుంటున్నాను అన్నాడు. మరి ఇంకేమిటి చేసుకోమని చెప్పాను.
ఎవడో ఏదో అనుకుంటాడు అనుకుంటే దానిని ఎవరు పట్టించుకుంటారు. ఇతరుల ఏదో అనుకుంటున్నారు అని నేను పట్టించుకున్నప్పుడు నన్ను నేను మరిచిపోతాను. ముందుకు సాగలేను. కుక్కలు మొరుగుతూ ఉంటాయి. ఎన్ని కుక్కలను నువ్వు ఆపుతావు. మొరగనియ్ కుక్కల్ని.. ఆ శబ్ధం కూడా నువ్వు వినలేనట్టు ప్రయాణం చేస్తుండు. నువ్వు గొప్ప వ్యక్తివి అవుతావు అంటూ మోహన్ బాబు తమ ఫ్యామిలీపై వచ్చే ట్రోల్స్ పై గట్టిగా స్పందించారు. ఇక మంచు మనోజ్-భూమా మౌనికలు తమ ముందు పెళ్లిళ్లు జరగకముందే ప్రేమించుకున్న విషయాన్ని అడగగా దానిని ఆయన సూటిగా సమాధానం ఇవ్వలేదు.
భూమా ఫ్యామిలీ నాకు ఎప్పటినుండో తెలుసు. వాళ్లు చాలా మంచివాళ్లు. పెళ్లి చేసుకున్నారు.. మొదట్నుంచీ ప్రేమించుకున్నారా.. ఆ అమ్మాయి ఏ క్లాస్ చదివేది.. మనోజ్ ఏ క్లాస్ చదివేవాడు... ఎలా ఎప్పుడు ప్రేమించుకున్నారు అనేది వద్దు. శుభంగా పెళ్లిచేసుకున్నారు.. శుభంగా ఆశీర్వదించాలి. మనస్ఫూర్తిగా నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటూ మంచు మనోజ్ పెళ్లిపై మోహన్ బాబు స్పందించారు.