నందమూరి తారకరత్న ఈలోకాన్ని వదిలి ఈరోజుకి అంటే మార్చ్ 18కి ఒక్క నెల పూర్తయ్యింది. గత నెల మహాశివరాత్రి రోజున కుటుంబాన్ని, అభిమానులని, భార్య పిల్లలని బాధపెడుతూ శాశ్వతంగా తిరిగిరాని లోకాలకి తరలివెళ్ళిన తారకరత్న మరణం అభిమానులని ఎంతగా బాధపెట్టిందో తెలియదు కానీ.. ఆయన భార్య అలేఖ్యని కోలుకోనివ్వడం లేదు. తారకరత్న మరణించిన మూడోరోజు, ఆయన బర్త్ డేకి, పెద్ద కర్మకి తారకరత్నని తలుచుకుంటూ అలేఖ్య రెడ్డి చేసిన పోస్ట్ లు అభిమానుల మనసులని కదిలించాయి.
అలాగే తన భర్త ఆసుపత్రిలో ఉన్నప్పుడు, ఆయన మరణించాక అన్నింటిని నడిపించిన చిన్నమామగారు బాలక్రిష్ణకి కృతఙ్ఞతలు చెబుతూ ఓ పోస్ట్ పెట్టింది. అయితే ఈ రోజుకి తన భర్త తనని, పిల్లని వదిలి వెళ్లి నెల పూర్తి కావడంతో అలేఖ్య మరోసారి కన్నీరు మున్నీరవుతూ ఎమోషనల్ నోట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ నోట్ లో.. నువ్వు మానుండి దూరమై నేటికి నెలరోజులు పూర్తయ్యాయి. కానీ నీ జ్ఞాపకాలు మాత్రం నన్ను ఇప్పటికీ, ఎప్పటికీ దహించి వేస్తూనే ఉంటాయి.
మనం ప్రేమలో ఉన్నప్పుడు ఏమవుతుంది అని నేను భయంగా ఉన్నప్పటికీ నువ్వు మాత్రం మనం కచ్చితంగా కలిసి జీవిస్తాము అంటూ ధైర్యాన్ని ఇచ్చావు. నీ పోరాటం ఫలితంగా మన పెళ్లి జరిగింది. మన పెళ్లి తర్వాత కూడా మనపై ఎంతో మంది వివక్ష చూపించారు. అయినా కానీ నువ్వు నాకు దగ్గరగా ఉండటం నాకు ఎంతో ధైర్యాన్ని, సంతోషాన్ని ఇచ్చింది. నిషిక పుట్టాక మన లైఫ్ మారిపోయింది. మన హ్యాపీనెస్ రెట్టింపు అయ్యింది.
అయినప్పటికీ మన కష్టాలు తీరలేదు, అయినవాళ్ల ద్వేషంతో బాధపడుతూనే ఉన్నాము. నీ గుండెలోని బాధను వారు ఏనాడు అర్థం చేసుకోలేదు. నువ్వు మరణించే వరకు నాకు పెద్ద కుటుంబం అందించాలని తపన పడుతూ కలలు కనేవాడివి. నీకోరిక 2019లో మనకు కవలలు జన్మించడంతో నిజమైం, మనకు కావాల్సిన వారే మనల్ని పదే పదే గాయం చేసినా ఏమీ చేయలేక ఉండిపోయాము. నువ్వు రియల్ హీరో.. నిన్ను చూసి మేమంతా గర్విస్తున్నాం, మనం మళ్లీ ఎప్పటికైనా కలుస్తామని ఆశిస్తున్నా అంటూ తారకరత్నతో కలిసి సంతోషంగా ఉన్న ఫోటోలని అలేఖ్య సోషల్ మీడియాలో చెర్ చేస్తూ ఎమోషనల్ అయ్యింది.