నాన్న, బాబాయ్ నాకు రెండు కళ్లు.. ఆ ఇద్దరి తర్వాత అంతగా నేను గౌరవించేది రాజమౌళిగారినే అని అన్నారు మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఆస్కార్ వేడుకల అనంతరం ఢిల్లీ చేరుకున్న రామ్ చరణ్.. ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2023 సెషన్‌లో పాల్గొన్నారు. భార్య ఉపాసనతో కలిసి రామ్ చరణ్ ఈ ఈవెంట్‌కి హాజరయ్యారు. అయితే ఉదయం నుంచి అంతా.. రామ్ చరణ్ ఈ వేదికపై ఏం మాట్లాడతాడా? అంటూ భారీ స్థాయిలో చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఆ స్థాయికి తగినట్లే చరణ్.. ఈ వేడుకలో స్పీచ్ ఇచ్చారు. ఇండియా టుడే కాన్‌క్లేవ్ ఆర్గనైజర్స్ అడిగిన ప్రతి ప్రశ్నకు తనదైన తరహాలో సమాధానమిచ్చి.. అందరినీ అలరించారు.
ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా అనుకున్నప్పుడు రాజమౌళిగారు తారక్‌ని, నన్ను ఎంచుకోవడానికి కారణం మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహబంధమే. కథ కూడా ఇద్దరు స్నేహితులకు సంబంధించినది కావడంతో మాకు కరెక్ట్‌గా మ్యాచ్ అవుతుందని గమనించి మా ఇద్దరినీ సెలక్ట్ చేసుకున్నారు. రాజమౌళి చేసిన మ్యాజిక్ ఇది. ఎందుకంటే మేము స్నేహితులం అయినప్పటికీ.. మా ఫ్యామిలీల మధ్య పెద్ద యుద్ధం జరుగుతున్నట్లుగా అంతా భావిస్తుంటారు. అది ఈ సినిమాకు చాలా ఉపయోగపడింది. అందుకే మా ఇద్దరినీ రాజమౌళిగారు చూజ్ చేసుకుని ఉంటారు. 35 ఏళ్లుగా మా కుటుంబానికి, తారక్ కుటుంబానికి సినిమాల పరంగా, ఫ్యాన్స్ పరంగా పోటీ నడుస్తుంది. కానీ పర్సనల్‌గా అంటే మా కుటుంబాల మధ్య మా ఇద్దరి మధ్య మాత్రం అలాంటిది ఏమీ లేదు. మా ఇద్దరితో సినిమా కేవలం రాజమౌళిగారి కారణంగానే సాధ్యమైంది. వేరొకరైతే మేమిద్దరం ఇంట్రస్ట్ చూపించే వాళ్లం కాదేమో. ఆయనంటే అంత నమ్మకం. మా నాన్న.. బాబాయ్ పవన్ కల్యాణ్‌గారు తర్వాత నేను ఎక్కువగా గౌరవించే వ్యక్తి రాజమౌళిగారే. ఆయన వర్క్‌లో మిస్టర్ పర్ఫెక్ట్. ఆయన పనిని ఎంతగానో గౌరవిస్తారు. ఆయనంటే అంత నమ్మకం.
ఆస్కార్ అవార్డు గురించి.. 92 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో ఇండస్ట్రీ నుంచి ఈ స్థాయికి వెళ్లిన సినిమా లేదని నేను అనుకుంటున్నాను. కొన్ని సినిమాలు నామినేషన్ వరకూ వెళ్లి ఉండొచ్చు కానీ ఈ స్థాయిలో క్రేజ్ తెచ్చుకుంది మాత్రం ఆర్‌ఆర్‌ఆర్ సినిమానే. ఇది మా జక్కన్న చేసిన మ్యాజిక్. నాటునాటు పాట అంతగా పాపులర్ అయిందంటే దీని వెనుక ఎంతోమంది కష్టం ఉంది. హీరోలుగా చేసిన మా ఇద్దరికీ అయితే మా డైరెక్టర్ రాజమౌళి స్వీట్ టార్చర్ చూపించాడు. మేం కూడా అంతే ఎంజాయ్ చేస్తూ పని చేశాం. మా అందరి కష్టాల ఫలితమే ఆస్కార్ అవార్డు. మరో విషయం ఏమిటంటే.. ఈ పాట చిత్రీకరించిన ఉక్రెయిన్‌లో దాదాపు 100 మంది ఎంతగానో సపోర్ట్ చేశారు. మన కల్చర్‌కి అనుగుణంగా వారు మారిన తీరు, ఏం కావాలి? అంటూ మమ్మల్ని వారు కనిపెట్టుకుని ఉన్న తీరు హ్యాట్సాఫ్. వారికి కూడా ఈ క్రెడిట్ దక్కుతుంది.
రాపిడ్ ఫైర్
1. ఇష్టమైన కోస్టార్: కియారా అద్వానీ
2. పవన్ కల్యాణ్ – చిరంజీవి: రెండు కళ్లు.
3. ఇష్టమైన హీరో: మా డాడ్, సల్మాన్ ఖాన్
4. ఎలాంటి పాత్ర చేయాలనుంది: స్పోర్ట్స్ నేపథ్యమున్న కథ.
(విరాట్ కోహ్లీ బయోపిక్ తీస్తే యాక్ట్ చేస్తా. మా ఇద్దరి గడ్డం ఒకలానే ఉంటుంది)
5. ఫేవరెట్ టూరిస్ట్ ప్లేస్: రాజస్థాన్ – స్విట్జర్లాండ్