ఆర్.ఆర్.ఆర్ కి ఆస్కార్ రావడం పట్ల ఆర్.ఆర్.ఆర్ టీమ్ మొత్తానికి పండగలా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలు, భారతీయులు అంతా నాటు నాటుకు వచ్చిన ఆస్కార్ తో పూనకాలతో ఊగిపోతున్నారు. ఇంతిలాంటి సంతోషాల వేడుకలో ఆర్.ఆర్.ఆర్ ని భారీ బడ్జెట్ తో నిర్మించిన దానయ్య పాలు పంచుకోకపోవడం అనేది చాలామందికి వెలితిగా అనిపించింది. అసలు దానయ్య ఈ ఆస్కార్ వేడుకకి ఎందుకు దూరంగా ఉన్నారో అనేది చాలామందికి అంతుబట్టలేదు. ఏవేవో కారణాలు వినిపించినా.. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ కి ఆస్కార్ కి వచ్చిన సందర్భంలో దానయ్య మీడియాతో మట్లాడుతూ ఆర్.ఆర్.ఆర్ టీమ్ రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ లపై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
రాజమౌళి తో సినిమా చెయ్యాలనే కోరికతో ఆయనకి 2006 లో అడ్వాన్స్ ఇచ్చాను. తర్వాత మర్యాదరామన్న చేద్దామని రాజమౌళి అడిగినా.. ఇంకా పెద్ద సినిమా చేద్దామన్నాను, తర్వాత రెండు సినిమాలయ్యాక ఆర్.ఆర్.ఆర్ పట్టాలెక్కింది. ఇద్దరు స్టార్ హీరోలతో ఆర్.ఆర్.ఆర్ మొదలవుతుంది అని ఊహించలేదు. ఆ సినిమా బడ్జెట్ అనుకున్నదానికన్నా ఎక్కువే అయ్యింది. కోవిడ్ వల్ల బాగా ఇబ్బంది పడ్డాము, ఎంతో కష్టపడి సినిమాని రిలీజ్ చేసాము. ఆ కష్టానికి ప్రతి ఫలమే ఆర్.ఆర్.ఆర్ సాంగ్ కి ఆస్కార్ వచ్చింది. ఆ పాట కోసం 30 రోజులు రిహార్సల్స్, 17 రోజుల పాటు ఉక్రెయిన్ లో చిత్రీకరణ చేపట్టాము.
ఆ సాంగ్ కి ఆస్కార్ రావడం చాలా సంతోషంగా ఉంది. నాటు నాటు కి వచ్చిన ఆస్కార్ అవార్డు క్రెడిట్ మొత్తం రాజమౌళికి దక్కుతుంది. ఆస్కార్ ప్రకటించాక రాజమౌళి కి ఫోన్ చేశాను.. కానీ ఆయన అక్కడ పార్టీలో బిజీగా ఉండి స్పందించలేదు. ఆర్.ఆర్.ఆర్ విజయం తర్వాత చరణ్, ఎన్టీఆర్ లతో కూడా కాంటాక్ట్ లో లేను అంటూ దానయ్య చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
కానీ ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ సినిమాని నిర్మించిన దానయ్య ఫోన్ కాల్ రాజమౌళి లిఫ్ట్ చేయకపోవడంపై నెటిజెన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.