దేశం మొత్తం నాటు నాటు మయమైంది. జక్కన్న చెక్కిన శిల్పంలోని ఓ పార్ట్‌కి ఆస్కార్ అవార్డ్ వరించింది. ఇప్పటికే ఎన్నో అవార్డులను కొల్లగొడుతూ దూసుకెళుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రం.. తెలుగువాడి చిరకాల స్వప్నం అయిన ‘ఆస్కార్’ని కూడా అదిరిపోయే రేంజ్‌లో అందుకుంది. ఈ అవార్డ్‌తో తెలుగువాడి గుండె ఇంకాస్త విరుచుకుంది. అయితే ‘నాటు నాటు’ మత్తులో మరో విషయాన్ని అంతా మరిచిపోతున్నారు.
ఆర్ఆర్ఆర్ ‘నాటు నాటు’ పాటతో పాటు.. భారతదేశం తరపున అఫీషియల్‌గా కేంద్రం పంపించిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ చిత్రం కూడా బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. దర్శకురాలు కార్తికి గోన్‌సాల్వెస్, నిర్మాత గునీత్ మోగ్న ఈ అవార్డును ఆస్కార్ వేదికపై అందుకని ఉద్వేగభరితమయ్యారు. తమ శ్రమని గుర్తించి.. ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డును అందించిన అకాడమీ బృందానికి, అలాగే ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి వారు ధన్యవాదాలు తెలిపారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు నాటు’, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’.. మొత్తంగా రెండు ఆస్కార్ అవార్డులతో ఇండియన్ సినిమా గర్వపడేలా చేసిన వారిపై ప్రస్తుతం అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ విషయానికి వస్తే.. ఇది రెండు అనాథ ఏనుగు పిల్లల కథ. అమ్ము, రఘు అనే రెండు అనాథ ఏనుగు పిల్లలను ఆదరించిన దంపతుల కథ. 42 నిమిషాల నిడివి గల ఈ చిత్రంలో కనిపించేది కేవలం ఇద్దరు వ్యక్తులు, రెండు ఏనుగులు మాత్రమే. ఎంతో హృద్యంగా తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రపంచాన్ని ఆకర్షించి అవార్డును గెలుచుకోవడం నిజంగా గొప్ప విషయంగానే భావించాలి. మరో విశేషం ఏమిటంటే.. ఈ చిత్రాన్ని రూపొందించిన దర్శకురాలు కార్తికీకి ఇది మొదటి చిత్రం. తొలి చిత్రంతోనే ఆస్కార్ అందుకుని కార్తికి చరిత్ర సృష్టించింది.