ఈ నక్కల వేట ఇంకెన్నాళ్లు.. కొడితే కుంభస్థలం బద్దలు కావాలి.. అని ‘RRR’ చిత్రంలో రామ్ చరణ్ చెప్పిన డైలాగ్‌లా.. రాజమౌళి అండ్ టీమ్ కుంభస్థలం బద్దలు కొట్టారు. ఆర్ఆర్ఆర్ తెలుగోడి పవర్‌ని ప్రపంచానికి చాటింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ సువర్ణాక్షరాలతో రాసుకునే చరిత్రను సృష్టించింది. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఉత్తమ పాటగా నిలబడి ఆస్కార్ అవార్డును అందుకుంది. లాస్ ఏంజిల్స్ వేదికగా.. తెలుగు సినిమా స్థాయి ఏంటో మరోసారి ప్రపంచానికి తెలిసింది.
95వ ఆస్కార్స్ అవార్డులకు సంబంధించి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో మహామహులు పాడిన పాటలని తలదన్ని.. ‘ఆర్ఆర్ఆర్’ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. తెలుగు వారు గర్వపడే క్షణమిది. అప్లాజ్, లిఫ్ట్ మి అప్, దిస్ ఈజ్ ఏ లైఫ్, హోల్డ్ మై హ్యాండ్ వంటి పాటలను పక్కకు నెట్టి ‘నాటు నాటు’ ఆస్కార్ దక్కించుకుంది. దీంతో ఆర్ఆర్ఆర్ టీమ్ మాత్రమే కాదు.. తెలుగు సినిమా ప్రేక్షకులంతా ఆనందోత్సవాల్లో మునిగిపోయారు.
ఇది ఒక చరిత్ర:
దాదాపు 90 సంవత్సరాల చరిత్ర గలిగిన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం చరిత్రను సృష్టించింది. ఇప్పటి వరకు రాని, లేని ఆస్కార్‌ను అందుకుని సరికొత్త చరిత్రను లిఖించింది. ఇది తెలుగువాడి కల, తెలుగువాడి గౌరవం. దర్శకుడు రాజమౌళికి యావత్ తెలుగు సినీ పరిశ్రమ శిరస్సు వంచి నమస్కరిస్తోంది. ఈ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ మనసులోనే ప్రేక్షకులు అభినందనలు తెలుపుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పండగ వాతావరణం కనిపిస్తోంది. టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ.. వారే అవార్డ్ అందుకున్నట్లుగా ఫీలవుతున్నారు.