ఒక వైపు బిగ్ బి అమితాబ్‌కు ‘ప్రాజెక్ట్ K’ సెట్స్‌లో యాక్సిడెంట్ అయినట్లుగా వార్తలు వైరల్ అవుతుంటే.. మరోవైపు ఆ చిత్ర నిర్మాత అశ్వనీదత్.. అలాంటిదేమీ జరగలేదంటూ కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ‘ప్రాజెక్ట్ K’ సెట్స్‌లో ప్రమాదం జరిగిందని, ఆ ప్రమాదంలో తన పక్కటెముకలకు గాయాలై.. బాగా పెయిన్‌గా ఉందంటూ స్వయంగా బిగ్ బినే తన బ్లాగ్‌లో చెప్పుకొస్తే.. అశ్వనీదత్ మాత్రం ఆ వార్తలను కొట్టిపడేస్తున్నారు. దీంతో.. ‘ప్రాజెక్ట్ K’ విషయంలో ఏమైనా గొడవలు జరుగుతున్నాయా? బిగ్ బి ఈ మూవీ నుంచి తప్పుకున్నారా? అనేలా అనుమానాలు మొదలయ్యాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో గ్లోబల్ స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ప్రాజెక్ట్ K’. ఈ సినిమాపై ఎటువంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు. ముఖ్యంగా ఇందులో నటించే తారాగణంతోనే.. ఈ ప్రాజెక్ట్ భారీ క్రేజ్‌ని సొంతం చేసుకుంది. బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్, బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే ఈ చిత్రంలో నటిస్తుండటంతో.. పిక్చర్ స్థాయే మారిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదం సంభవించిందని.. ఈ ప్రమాదంలో అమితాబచ్చన్ గాయపడ్డారని తాజాగా వార్త బయటికి వచ్చింది. ఈ ప్రమాదం జరిగి నాలుగు రోజులు అవుతుందట. ఈ ప్రమాదంలో అమితాబచ్చన్ పక్కటెములకి గాయాలయ్యాయని, వెంటనే ఆయనని గచ్చిబౌలిలోని AIG హాస్పిటల్‌కి చిత్రయూనిట్ తరలించి.. ఆ తర్వాత ముంబైకి షిఫ్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం బెడ్ రెస్ట్‌లో ఉన్న అమితాబ్ ఈ విషయాన్ని రివీల్ చేయడంతో.. సామాజిక మాధ్యమాలలో ఈ వార్త వైరల్ అవుతోంది.
ఇదే విషయంపై ఓ న్యూస్ ఛానల్ అశ్వనీదత్‌ని సంప్రదించగా.. ప్రాజెక్ట్ K షూటింగ్‌లో అమితాబ్ గారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. 3 రోజుల క్రితం ఆయన షూటింగ్ ముగించుకుని ముంబై వెళ్లారు. ఇప్పుడు వైరల్ అవుతున్న వార్తకి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వనవసరం లేదు.. అంటూ ప్రమాదం జరిగినట్లుగా వస్తున్న వార్తల్ని ఖండించారు. మరి అశ్వనీదత్ ఇలా అంటే.. అమితాబ్ ఎందుకు అలా పోస్ట్ చేసి ఉంటారనేలా ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి.