తారకరత్న ఈలోకాన్ని విడిచివెళ్లిపోవడం ఆయన భార్య లేఖ్య రెడ్డి ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. భర్త అచేతనంగా పడి ఉండడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. తారకరత్న మరణించిన రోజు నుండి ఆయన పెద్ద కర్మ జరిగిన రోజు చూస్తే అలేఖ్య బాగా ఢీలా పడిపోయి కనిపించింది. తన బాధని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా రూపంలో బయటపెడుతోంది. తారకరత్న పుట్టిన రోజుకి కూతురు నిష్కతో కలిసి ఉన్న పిక్ షేర్ చేస్తూ ఎమోషనల్ అయిన అలేఖ్య రెడ్డి.. ఆయన చిన్న కర్మ తర్వాత తాను తారకరత్నతో కలిసి చివరిగా దిగిన పిక్ ని షేర్ చేస్తూ తన భర్తతో తాను చేసిన జర్నీని కన్నీళ్ల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నిన్న గురువారం తారకరత్న పెద్ద కర్మ జరిగింది.
అలేఖ్య మరోసారి ఎమోషనల్ అవుతూ భర్త తారకరత్న తనకి వాలెంటైన్స్ డే కి రాసిన లెటర్ సోషల్ మీడియాలో ఉంచింది. ఆ లెటర్ లో తారకరత్న తన భార్య అలేఖ్యపై ఉన్న ప్రేమని ప్రతి అక్షరంలో చూపించారు. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా నువ్వంటేనే నాకు చాలా ఇష్టం. నా కన్నా నేను నిన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాను. కొన్నిసార్లు తెలియకుండానే నిన్ను బాధ పెట్టి ఉండచ్చు. అయినా అన్నిటినీ భరించి నన్ను నువ్వు ప్రేమించావు. కష్ట సమయాల్లో నాకు అండగా ఉన్నావు. నా జీవితంలో చివరి శ్వాస వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. నా లైఫ్‌లో నాకున్న ఒకే ఒక ప్రపంచం నువ్వే బంగారు. హ్యాపీ వాలంటైన్స్ డే. లవ్యూ సో మచ్ బంగారం అంటూ ఆ లెటర్ లో తారకరత్న భార్య పై ప్రేమని కురిపించారు.
ఈ లెటర్ ని అలేఖ్య సోషల్ మీడియాలో షేర్ చేసి.. మన జీవితంలో ఎన్నో రకాల కష్ట సుఖాలు చూశాం. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. లైఫ్ లో అత్యంత కష్టకాలం అనుభవించాం. మన కష్టాలు మనకు మాత్రమే తెలుసు. మంచి రోజుల కోసం చాలా ఎదురు చూశాం. మనిద్దరం కలిసి ఒక చిన్న కుటుంబాన్ని సృష్టించుకున్నాం. నీ జీవితంలో నువ్వు పడిన కష్టాలు ఎవరికీ తెలియదు. నాలా ఎవరూ నిన్ను అర్థం చేసుకోలేదు. నేను నిన్ను అర్థం చేసుకున్నందుకు సంతోషిస్తున్నా. నీ బాధనంతా నీలోనే దాచుకున్నావు. కానీ మాకు అపారమైన ప్రేమను అందించావు.
ప్రపంచం ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని సమస్యలు సృష్టించినా నువ్వు మా చుట్టే ఉన్నావు. నేను మరింత ఎత్తుకు ఎదుగుతా నానా. మేము చాలా మిస్ అవుతున్నాం నానా అంటూ అలేఖ్య ఆ లేఖతో పాటుగా రాసుకొచ్చింది.