ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేయబోతున్నాయి. సంక్రాంతికి వచ్చిన చిత్రాలు 50 రోజులు పూర్తి చేసుకోవడంతో.. వాటి హవా కూడా ఓ రెండు మూడు రోజులు నడిచే అవకాశం ఉంది. అలాగే రెండు మూడు పెద్ద హీరోల సినిమాలు కూడా ఈ వారం రీ రిలీజ్‌కు ప్లాన్ చేశారు. మొత్తంగా చూస్తే మాత్రం ఈ వారం అన్ని రకాల సినిమాలతో బాక్సాఫీస్ కళకళలాడే పరిస్థితే కనబడుతోంది. అయితే ప్రేక్షకులు ఏం డిసైడ్ అవుతారనే దానిపైనే ఈ వారం భవిష్యత్ ఆధారపడి ఉంది. ఇక ఈ వారం థియేటర్లలోకి రాబోతోన్న సినిమాల వివరాలివే..
బలగం:
జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకుడిగా మారి రూపొందించిన తొలి చిత్రం ‘బలగం’. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ షోలు పడ్డాయి. ఈ షోల ద్వారా వచ్చిన టాక్ ప్రకారం ఈ వారం ఈ సినిమా విన్నర్ అనే చెప్పుకోవాలి. సినిమా విడుదలకు ముందే రివ్యూలన్నీ పాజిటివ్‌గా రావడం ఈ సినిమాకి అతి పెద్ద బలం. అలాగే దిల్ రాజు, తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమాకు ఫుల్ సపోర్ట్‌గా నిలుస్తుండటంతో.. విడుదలకు ముందే ఈ సినిమా లాభాల బాటలో ఉంది.
ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు:
చాలా గ్యాప్ తర్వాత మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’. ఇందులో సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్, మీనా కీలక పాత్రలలో నటించగా.. బిగ్‌బాస్ ఫేం సోహెల్, మృణాళిని హీరోహీరోయిన్లుగా నటించారు. ఎప్పుడూ కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డి.. ఈ చిత్రానికి మాటలు కూడా రాశారు. ట్రైలర్‌తోనే ఆకట్టుకున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.
ఇన్‌కార్:
నేషనల్ అవార్డ్ విన్నర్, ‘గురు’ సినిమా ఫేమ్ రితికా సింగ్ ప్రధాన పాత్రలో రూపొందిన సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ‘ఇన్ కార్’. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్‌గా విడుదలవుతుండటంతో పాటు.. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం కూడా ఈ సినిమా వైపు చూసేలా చేస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాని వార్తలలో ఉంచేందుకు రితికా సింగ్ బాగానే కష్టపడింది. సీరియస్, కంప్లీట్ రా ఫిల్మ్‌గా ఈ సినిమా ఉండబోతుందని మేకర్స్ తెలిపారు. అంతే కాదు, ఈ సినిమాకి జాతీయ అవార్డ్ ఖాయం అని వారు చెబుతున్న మాటలు వింటుంటే సినిమాలో ఏదో మ్యాటర్ ఉన్నట్లే అనిపిస్తుంది. చూద్దాం మరి.. బాక్సాఫీస్ వద్ద ఎటువంటి రిజల్ట్‌ని అందుకుంటుందో. ఈ సినిమాకి హర్ష వర్ధన్ దర్శకుడు.
రిచి గాడి పెళ్లి:
కెఏస్‌ఫిల్మ్ వర్క్స్ పతాకంపై కె ఎస్ హేమరాజ్ దర్శకత్వం వహిస్తూ.. నిర్మించిన చిత్రం ‘రిచి గాడి పెళ్లి’. ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు కూడా మేకర్స్ ప్రీమియర్స్ నిర్వహించారు.
ఈ చిత్రాలతో పాటు ‘సాచి’, ‘గ్రంథాలయం’ వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయి.