జై సినిమాతో కమెడియన్ గా ఇంట్రడ్యూస్ అయిన వేణు ఆపై అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కమెడియన్ గా తనదైన ముద్ర చూపించగలిగాడు. మున్నా సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ గా, జగడంలో రామ్ కి ఫ్రెండ్ గా ఇలా పలు చిత్రాల్లో మంచి పాత్రలే పోషించిన వేణుకి సరైన బ్రేక్ దొరికింది మాత్రం జబర్దస్త్ వేదికపైనే అని చెప్పాలి. వండర్స్ వేణు అంటూ వారం వారం కొన్ని సంవత్సరాలపాటు ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసిన వేణు ఆ తర్వాత జబర్దస్త్ కి దూరమైనా.. తన కెరీర్ కి మరో జబర్దస్త్ రూట్ ఎంచుకున్నారు.
ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించగలిగే స్కిట్స్ రాసిన తన కలంతో అదే ప్రేక్షకుల హృదయాలని కదిలించే కథని సిద్ధం చేసుకుని దర్శకుడిగా మారాడు. దిల్ రాజు వంటి అగ్రనిర్మాత అండ దొరికింది. అతననుకున్న కథకి కావల్సిన తారాగణం సమకూరింది. అనుకున్న బడ్జెట్ లో అతి తక్కువ వర్కింగ్ డేస్ లో మట్టి వాసన తెలిసేలా గట్టిగా మనసులని తాకేలా వేణు మలచిన బలగం సినిమాకి.. ప్రస్తుతం ప్రశంశల వర్షం కురుస్తోంది. ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించిన ప్రతి చోట దర్శకుడిగా వేణు అభినందనలు అందుకుంటూ వస్తున్నాడు.
ఇప్పటికే బడ్జెట్ వైజ్ భారీ విజయం తథ్యం అన్న ఆ సినిమాపై నమ్మకంతో ఉన్న దిల్ రాజు విడుదల ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నారు. ఇక మిగిలింది అల్టిమేట్ గా ప్రేక్షకులు ఇచ్చే తీర్పే. అదేమిటన్నది ఈ వారం మనం చూడబోతున్నాం. ఆశిస్తున్న ఫలితం అందితే మాత్రం దర్శకుడిగా వేణు బలం, బలగం ప్రూవ్ అవుతాయి. ఆల్ ద బెస్ట్ వేణు. మేక్ వండర్స్.. యాజ్ ఏ డైరెక్టర్ టూ..!