నందమూరి తారకరత్న గత శనివారం మహాశివరాత్రి రోజున చికిత్స పొందుతూ బెంగుళూరులోని నారాయణా హృదయాల ఆసుపత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. తారకరత్న కన్ను మూసాక అభిమానుల సందర్శనాంతరం ఆయనకి మూడో రోజు తండ్రి మోహన కృష్ణ చేతుల మీదుగా అంత్యక్రియలు నిర్వహించారు నందమూరి కుటుంబ సభ్యులు. ఇక తారకరత్నకు ఐదో రోజు FNCC లో చిన్న కర్మని నిర్వహించారు.
తారకరత్న ఆసుపత్రిలో చేరినప్పటినుండి నందమూరి బాలకృష్ణ తారకరత్నని బ్రతికించడానికి అహర్నిశలు కష్టపడ్డారు. మరణం తర్వాత కూడా ఆయన తారకరత్నకు చెయ్యాల్సిన అన్ని కార్యక్రమాలను దగ్గరుండి అన్న మోహనకృష్ణ చేత చేయిస్తున్నారు. ఇక తారకరత్న పెద్ద కర్మని మార్చి 2 న నిశ్చయించారు కుటుంబ సభ్యులు. హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్(FNCC) లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించిన కార్డును నందమూరి కుటుంబ సభ్యులు ప్రింట్ చేయించారు. కార్డుపై వెల్ విషర్స్ గా బాలకృష్ణ, వైసీపీ నేత విజయసాయిరెడ్డి పేర్లను వేశారు. తారకరత్న పెద్ద కర్మ కార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.