బాహుబలి గా సత్తా చాటి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయిన రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీ గా ఉన్న విషయం తెలిసిందే. తన్హాజీ తో నేషనల్ అవార్డు అందుకున్న ఓం రావత్ దర్శకత్వంలో ఆదిపురుష్ చిత్రం పూర్తి చేసిన ప్రభాస్ మరో నేషనల్ అవార్డు విన్నర్ నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ K చేస్తున్నారు. ఇక ఈ రెండిటి మధ్యలో తిరుగులేని కమర్షియల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సలార్ ఉండనే ఉంది. ఆపై కూడా ఇటీవలే పఠాన్ తో బాలీవుడ్ ని మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కించిన సిద్దార్థ్ ఆనంద్ సినిమా కూడా ప్లానింగ్ జరుగుతోంది.
ఇన్ని భారీ సినిమాల మధ్య, ఇంతమంది మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్స్ మధ్య ప్రభాస్ నుంచి ఈ రోజుల్లో ఆటవిడుపుగా అవకాశం అందుకున్న మారుతి చక చకా తన సినిమాని పూర్తి చేసే పనిలో పడ్డాడు. ప్రభాస్ ఒక్క రోజు డేట్ ఇచ్చిన చాలు అనేలా షూటింగ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ముగ్గురు హీరోయిన్లని సెటప్ చేసి షూటింగ్ స్టార్ట్ చేసేసాడు. ఇండోర్ షూటింగ్ ని ఇష్టపడే ప్రభాస్ కోసం ఒక థియేటర్ సెట్ సిద్ధం చేసేలా కథని మలిచి చిత్రీకరణకు కదిలాడు. అంతే కాదు.. ఈ సినిమాకి కూడా పాన్ ఇండియా వైబ్ వచ్చేలా క్యాస్టింగ్ కోసం కుస్తీ పడుతున్న మారుతి కథలోని ప్రభాస్ తాత పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ ని ఒప్పించేసినట్టు ఫీలర్లు ఒదులుతున్నాడు.
మారుతి వేసే బిస్కెట్లకు అనుగుణంగా కొందరు సౌండ్స్ చేస్తూ ఉండొచ్చు కానీ వాళ్లపై మనం GHMC కి కంప్లైంట్ ఏం ఇస్తాం. అధికారిక ప్రకటన కోసం వేచి చూద్దాం. సంజయ్ దత్ న్యూస్ నిజం అయితే అప్పటికైనా ప్రభాస్ తో మారుతీ చేసే సినిమాకి కాస్త మంచి బజ్ వస్తుందని ఆశిద్దాం.!