కరోనా క్రైసిస్ దగ్గర నుండి ప్రేక్షకులు ఓటిటి ప్రపంచంలోకి అడుగుపెట్టారు. థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు ఎప్పటికైనా ఓటిటిలోకి రావాల్సిందే అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. గతంలో థియేటర్స్ లో విడుదలైన ఏ సినిమా అయినా.. శాటిలైట్ హక్కులు కొనుక్కున్న ఛానల్స్ ఏ ఆరు నెలలకో, లేదంటే ఏడాదికో టీవీలో ప్రసారం చేసేవి. కానీ.. ఇప్పుడు ఓటిటీలు అందుబాటులోకి వచ్చాక.. థియేటర్స్ లో విడుదలై నెల తిరక్కుండానే సినిమాలు ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి. ఓటిటి సంస్థలు కూడా పోటీపడి సినిమా డిజిటల్ హక్కులని ఎక్కువ మొత్తానికి కొంటున్నాయి.
అందుకే ప్రేక్షకులు పెద్దగా థియేటర్స్ ని పట్టించుకోనట్టు ఇప్పుడు శాటిలైట్ అంటే బుల్లితెర మీద వచ్చేవరకు ఆగకుండా ఓటిటీలలో సినిమాలు చూసేస్తున్నారు. ఓటిటీల వలన థియేటర్స్ వ్యవస్థ మనుగడకే ముప్పు అంటూ ఎంతగా గోల చేస్తున్నారో.. ఇప్పుడు శాటిలైట్ హక్కులు కొనుక్కుని స్టార్ మా, జెమినీ, ఈటివి, జీ తెలుగు ఇలా కొత్త సినిమాలని ప్రసారం చేస్తున్నా మంచి టిఆర్పి రాక ఛానల్స్ బావురుమంటున్నాయి. థియేటర్స్ లో హిట్ అయిన సినిమాకి టీవీలో పూర్ టీఆర్పీ వస్తుంది.
మొన్నామధ్యన వచ్చిన విక్రమ్, గాడ్ ఫాదర్.. నిన్న సర్దార్ సినిమాలు థియేటర్స్ లో మంచి హిట్ అయిన సినిమాలే.. కానీ ఈ సినిమాలు బుల్లితెర మీద మీద ప్లాప్ షోలుగా మిగిలిపోవడానికి కారణం కేవలం ఓటిటీలే.