నందమూరి కుటుంబాన్ని పెను విషాదం చుట్టుముట్టింది. నందమూరి తారకరత్న 40 ఏళ్ళు నిండక ముందే గుండెపోటుతో కన్ను మూయడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. తారకరత్న లోకేష్ యువ గళం పాదయాత్రలో సివియర్ హార్ట్ ఎటాక్ కి గురి కావడంతో ఆయనని హుటాహుటిన కుప్పం ఆసుపత్రికి తరలించింది మొదలు నందమూరి బాలకృష్ణ తన అన్న కొడుకు తారక రత్న కోసం అహర్నిశలు ఆసుపత్రిలోనే ఉండి శ్రమించారు. తారకరత్న కి గుండెపోటు రావడానికి ముందు రోజు కూడా తారకరత్న తన బాల బాబాయితోనే కలిసి ఓ పెళ్ళికి హాజరయ్యారు. బాలకృష్ణకి తారకరత్న అంటే ప్రాణం, అలాగే తారకరత్నకు బాబాయ్ అంటే అంతే ఇష్టం.
అందుకే బాలకృష్ణ అన్న కొడుకు కోసం చాలా కష్టపడ్డారు. ఒకానొక సమయంలో యముడితో పోరాడుతున్నది తారకరత్నా? లేదంటే బాలకృష్ణ? అన్నంతగా బాలయ్య ఆసుపత్రిలో విషణ్ణవదనాలతో కనిపించారు. తారకరత్నని కుప్పం నుండి బెంగుళూరుకి తరలించాక కూడా బాలయ్య తారకరత్నని వదల్లేదు. ఇటు డాక్టర్స్ తో మట్లాడుతూ.. అటు కుటుంబాన్ని సముదాయిస్తూ కనిపించారు. తారకరత్నని కాపాడుకోవడానికి శతవిధాలుగా కష్టపడ్డారు.
విదేశాల నుండి వైద్యులని రప్పించడం దగ్గరనుండి అన్ని ఆయనే చూసుకున్నారు. అంతేకాకుండా తారకరత్న కోసం గుడిలో పూజలు, మృత్యుంజయ హోమాలు చేయించారు. అయినప్పటికీ తారకరత్నని బ్రతికించుకోలేకపోయారు. నిన్న తారకరత్న కండిషన్ క్రిటికల్ గా మారడంతో బాలకృష్ణ హుటాహుటిన బెంగుళూరికి వెళ్లి, అన్న కొడుకు కన్నుమూసిన క్షణం నుండి భౌతిక కాయం ఇంటికి చేరేవరకు దగ్గరుండి చూసుకున్న బాలయ్య బాధని ఎవరు తీర్చగలరు. తిరిగిరాని లోకాలకి వెళ్లిపోయిన అన్న కొడుకుని చూసి కన్నీటి పర్యంతమవుతున్న బాలయ్యని ఓదార్చ తరమా.
బాలకృష్ణ మెంటాలిటీ తెలిసిన వారు ఆయన దగ్గరకి వెళ్లి సముదాయించే సాహసం చెయ్యగలరా..
తారకరత్న మృతిపై బాలయ్య స్పందిస్తూ.. తారకరత్న తనను బాల బాబాయ్.. బాల బాబాయ్ అంటూ ఆప్యాయంగా పిలిచేవాడని.. తనను అంత ఆప్యాయంగా పిలిచే మా తారకరత్న పిలుపు ఇక వినబడదు అనే ఊహించుకోవడాన్నే తాను తట్టుకోలేకపోతున్నాను అని ఆవేదన వ్యక్తంచేశారు. తారకరత్న మృతి నందమూరి అభిమానులకు, టిడిపి కుటుంబ సభ్యులకు తీరని లోటు అని బాలకృష్ణ పేర్కొన్నారు. నటనలోనూ తనకు తాను నిరూపించుకున్న హీరో తారక రత్న అని గుర్తుచేసుకుంటూ బాలయ్య కన్నీటి పర్యంతమయ్యారు.
తిరిగి తీసుకురాని లోకాలకి తరలివెళ్లిన తారకరత్న కోసం బాలకృష్ణ పడే ఆవేదనని తీర్చగలమా అంటూ నందమూరి అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.. బాలయ్య స్టే స్ట్రాంగ్ బాబు అంటూ ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు.