నందమూరి తారకరత్న తీవ్రమైన గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న శనివారం మహాశివరాత్రి రోజున కన్ను మూయడంతో నందమూరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 23 రోజులుగా కోమాలో ఉన్న తారకరత్న ప్రాణాలతో పోరాడుతూ తుది శ్వాస విడిచారు. తారకరత్నకు సివియర్ హార్ట్ పెయిన్ రావడంతో బెంగుళూరు నారాయణ హృదయాలయకి తరలించి చికిత్స అందించారు. దానితో నందమూరి ఫ్యామిలీ మొత్తం బెంగుళూరు వెళ్లి తారకరత్నని పరామర్శించింది. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు సోదరుడు తారకరత్నని బెంగుళూరు వెళ్లి పరామర్శించి వచ్చారు.
ఈరోజు ఆదివారం ఉదయం తారకరత్న పార్థీవ దేహాన్ని బెంగుళూరు నుండి రంగారెడ్డి జిల్లా మోకిలా లోని స్వగృహానికి తరలించారు. తండ్రి భౌతిక కాయాన్ని చూసిన ఆయన కూతురు వెక్కి వెక్కి ఏడవడం చూసిన వారు కన్నీటిపర్యంతమవుతున్నారు. సోదరుడు కడసారి చూపుల కోసం ఎన్టీఆర్ ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ లు తారకరత్న నివాసానికి వెళ్లి సోదరుడి భౌతిక కాయానికి నివాళులర్పించారు. సోదరుడి భౌతికకాయం దగ్గర నిలబడి కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఎన్టీఆర్ కన్నా వయసులో తారకరత్న నాలుగు నెలలు పెద్దవాడు. ప్రస్తుతం నందమూరి కుటుంబ సభ్యులతో పాటుగా.. మరికొంతమంది ప్రముఖులు తారకరత్న నివాసానికి వెళుతున్నారు.