ప్రముఖ దర్శకులు కళాతపస్వి కె విశ్వనాథ్ ఈ గురువారం రాత్రి అనారోగ్య కారణాలతో కన్నుమూసిన విషయం తెలిసిందే. 50 కి పైగా చిత్రాలకి దర్శకత్వం వహించిన కె విశ్వనాథ్ అంటే అందరికి ఎనలేని గౌరవం, ఇష్టం. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో బ్లాక్ బస్టర్ చిత్రాలని అందించి స్టార్ డం ఇవ్వడంతో చిరంజీవి కి ఆయనంటే ప్రత్యేకమైన గౌరవం, ఆయన తనకి పితృసమానులని చిరు ఎప్పుడూ చెబుతారు. విశ్వనాథ్ మృతి పట్ల చిరు ఎమోషనల్ అయ్యారు. పవన్ కళ్యాణ్, వెంకటేష్, మెగాస్టార్ చిరు, బోయపాటి, అలీ, కోట ఇలా ఇండస్ట్రీలోని ప్రముఖులు విశ్వనాథ్ పార్థీవ దేహానికి నివాళు అర్పించారు.
విశ్వనాథ్ కుటుంబ సభ్యులు ఆయన అంత్యక్రియలు పంజాగుట్ట స్మశానవాటికలో నిన్న శుక్రవారం మధ్యాన్నం మూడు గంటలకు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అయితే బ్రాహ్మణులైన కె విశ్వనాథ్ గారి అంత్యక్రియల్లో భాగంగా ఆయనని దహనం చెయ్యకుండా.. పూడ్చిపెట్టడంపై అందరిలో అనుమానాలు బయలుదేరాయి. బ్రాహ్మణులంటే కంపల్సరీ దహనమే చేస్తారు. కానీ ఆయనని కూర్చోబెట్టి ఖననం చెయ్యడం ఎవరికి అర్ధం కాలేదు. దహనసంస్కరాలు నిర్వహించాక ఆ ఆస్తికలని గంగా, గోదావరి, కృష్ణ ఇలా పుణ్య నదుల్లో కలపడం అనేది ఆచారంగా వస్తున్న వ్యవహారం. కానీ ఇక్కడ జరిగింది వేరుగా ఉండడంతో అలా ఎందుకు చేసారో చాలామందికి అర్ధం కాలేదు.
అయితే విశ్వనాథ్ గారిని ఇలా ఖననం చెయ్యడానికి ఓ ప్రత్యేకమైం కారణం ఉందట. విశ్వనాథ్ పూర్వికులు కర్ణాటక నుండి వలస వచ్చిన వీరశైవ ఆరాధ్యులుగా తెలుస్తోంది. వారికి ప్రత్యేక ఆచారసాంప్రదాయాలున్నాయట. అందులో భాగంగానే వాళ్ళ వీరశైవ ఆచార సంప్రదాయాలకు తగినట్టుగా విశ్వనాథ్ గారి పార్థీవ దేహాన్ని కుటుంబ సభ్యులు ఖననం చేసినట్లుగా తెలుస్తుంది.