తారకరత్న హెల్త్ విషయంలో ఏం జరుగుతుందో తెలియక అభిమానులు తీవ్రంగా ఆందోళపడుతున్నారు. తారకరత్న శరీరం చికిత్సకి స్పందిస్తుంది.. అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు తప్ప డాక్టర్స్ తారకరత్న విషయంలో పూర్తి భరోసా ఇవ్వడం లేదు, నిన్న బ్రెయిన్ సంబంధిత టెస్ట్ లు చేసారు. అందులో కొద్దిగా బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది, న్యూరాలజిస్ట్ లు తారకరత్నని ట్రీట్ చేస్తున్నారని అన్నారు. కానీ ఈ విషయంలో కుటుంబ సభ్యులు సైలెంట్ గానే ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి తారకరత్నకు సంబందించిన హెల్త్ అప్ డేట్ ఇచ్చాక కూడా నందమూరి కుటుంబ సభ్యులు నుండి ఎలాంటి స్పందన లేదు.
ఇక ఈరోజు తారకరత్నకు మరికొన్ని టెస్ట్ లు చేస్తున్నారని అన్నారు. ఆ వివరాలు ఇంతవరకు బయటపెట్టలేదు. విజయసాయి రెడ్డి తారకరత్న ఉన్న ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి వచ్చి.. తారకరత్న ఆరోగ్యంపై మాట్లాడారు. తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని, గుండెపోటు వచ్చిన రోజు 45 నిమిషాలు రక్త ప్రసరణ ఆగిపోవడం వల్ల మెదడు పై భాగం దెబ్బతిన్నదని విజయసాయి రెడ్డి చెప్పారు. దానివలనే నీరు చేరి మెదడు వాచిందన్నారు. వాపు తగ్గిన వెంటనే బ్రెయిన్ రికవరీ అవుతుందని నారాయణ హృదయాలయ వైద్యులు తెలిపినట్లుగా ఆయన మీడియాకి చెప్పారు.
బాలకృష్ణ దగ్గరుండి తారకరత్నకు అన్ని వైద్యసదుపాయాలు కల్పిస్తున్నారు అంటూ బాలకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన విజయసాయి రెడ్డి.. తారకరత్న త్వరలోనే కోలుకుంటారని చెప్పారు. ప్రస్తుతం తారకరత్నకు వైద్యులు మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారని ఆయన తారకరత్న ఆరోగ్యంపై మీడియాకి చెప్పారు. అయితే తారకరత్న ఆరోగ్యంపై కుటుంబ సభ్యుల నుండి రెండు రోజులుగా ఎలాంటి స్పందన లేకపోయేసరికి.. తారకరత్న ఆరోగ్యంపై ఎందుకీ గోప్యత అంటున్నారు అభిమానులు.