పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనసేనానిగా రాజకీయాల్లో బాగా బిజీగా మారిపోతున్నారు. ప్రస్తుతం వారాహి రధసారథితో రాజకీయాల్లో కొత్తవరవడి సృష్టించడానికి రెడీ అయ్యారు. నిన్న మంగళవారం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో వారాహి వాహనానికి పూజలు చేయించి అక్కడనుండి ఆయన ప్రచారం మొదలు పెట్టారు. తెలంగాణ రాజకీయాల్లోనూ జనసేనాని పాల్గొంటున్నట్లుగా, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. జగిత్యాలలో వారాహి వాహనంపైకి ఎక్కి పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇచ్చారు. అనంతరం పవన్ కళ్యాణ్ వారాహి వాహనంతో ఏపిలోకి అడుగుపెట్టారు. రాక్షస పాలనను అంతం చేయడమే వారాహి లక్ష్యమని పవన్ కళ్యాణ్ తన వారాహి వాహనానికి విజయవాడ కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు.
పవన్ కళ్యాణ్ విజయవాడలో వారాహి వాహనంలో జనసైనికుల నడుమ విజయవాడ కనకదుర్గ ఆలయానికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కి విజయవాడ ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. దుర్గమ్మ ఆశీస్సుల కోసం ఇంద్రకీలాద్రికి వచ్చినట్లుగా పవన్ తెలిపారు. ముందుగా తెలంగాణలోని కొండగట్టులో వారాహికి పూజలు నిర్వహించి.. ఇప్పుడు అమ్మవారి సన్నధికి వచ్చామన్నారు. విజయవాడ దివ్య క్షేత్రం కాబట్టి ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదని.. తెలుగు రాష్ట్రాలు ఐక్యతతో ముందుకు సాగాలని పవన్ కోరుకున్నారు. అనంతరం కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.