నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ విజయాన్ని పురస్కరించుకుని ఆదివారం మేకర్స్ ‘వీరసింహుని విజయోత్సవం’ పేరుతో సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు యంగ్ దర్శకులు.. హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బాలయ్య మాట్లాడిన మాటలు పలు చర్చలకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా ఈ సంక్రాంతికి తన చిత్రంతో పాటు విడుదలైన సినిమాలన్నింటిలో.. తనదే నిఖార్సైన విజయమని, తనే సింహాన్ని అనేలా.. బాలయ్య చేసిన వ్యాఖ్యలపై పలు రకాలుగా చర్చలు నడుస్తున్నాయి.
ఈ కార్యక్రమంలో బాలయ్య మాట్లాడుతూ.. ‘‘ఎవరి గురించి వారు.. నేనంటే ఇదిరా అని చెప్పుకునే సత్తా, అలాంటి ధైర్యం.. చాలా తక్కువ మందికి ఉంటుంది. అసలందరికీ అతకదది. ఎందుకంటే.. ఆ నోటి మాట, దానికొక నిఖార్సు, అలాగే నిజాయితీతో కూడిన గర్జన అది. సింహం గర్జిస్తే ఎలా ఉంటుంది.. అలా ఒక గర్జన అది. మరి ఆ గర్జన ఎలా ఉండాలి? అంటే నిఖార్సు.. నిజాయితీగా ఉండాలి. ఈ రెండూ ఉండాలంటే.. నాలా సింహంలా పుట్టాలని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను..’’ అని బాలయ్య చెప్పుకొచ్చారు.
సడెన్‌గా బాలయ్య ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏమిటి? సంక్రాంతికి విడుదలైన చిత్రాలలో తన చిత్రమే సక్సెస్‌ఫుల్ చిత్రంగా నిలిచిందనా? లేక ఇతర చిత్రాలకు సంబంధించి వినిపిస్తున్న కలెక్షన్స్‌లో నిజాయితీ లేదనా? అలా అయితే.. తన చిత్రం నిర్మించిన మైత్రీ వారే కదా.. మరో చిత్రాన్ని కూడా నిర్మించింది. ఈ సంక్రాంతికి విడుదల చేసింది. వారే కదా.. అఫీషియల్‌గా కలెక్షన్ల పోస్టర్స్‌ని విడుదల చేస్తుంది. ఆ లెక్కన బాలయ్య మాటల్లో నిఖార్సు, నిజాయితీ లేదని అనుకోవాలా? లేదంటే మైత్రీ వారు విడుదల చేస్తున్న పోస్టర్స్‌లోని లెక్కలు నిజం కాదని అనుకోవాలా? ఏది ఏమైనా బాలయ్య వ్యాఖ్యలు మాత్రం.. ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అవుతూ.. ఇండస్ట్రీలో హీట్‌ని పెంచుతున్నాయి. మరి ఈ వ్యాఖ్యలకి కౌంటర్ ఏ రూపంలో రాబోతుందో చూద్దాం.