‘లా’ ను అభ్యసిస్తున్న వ్యక్తికి.. ఒక మహిళ పట్ల ఎలా ప్రవర్తించాలో తెలియదా? అని ప్రశ్నించారు ‘ఆకాశం నీ హద్దురా’ ఫేమ్ అపర్ణా బాలమురళి. తాజాగా ఆమె నటించిన మలయాళ చిత్రం ‘తన్కమ్’ ప్రోమోషన్స్‌లో భాగంగా కేరళలోని ఒక లా కాలేజీ ఫెస్టివల్‌కి అపర్ణ చిత్రయూనిట్‌తో పాటు హాజరైంది. చిత్రయూనిట్ అంతా స్టేజ్‌పై కూర్చుని ఉండగా.. ఆ లా కాలేజ్‌కి చెందిన ఓ విద్యార్థి.. ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. స్టేజ్‌పైకి వచ్చిన అతను.. ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చినట్లుగా ఇచ్చి.. ఆమెను పైకి లేవాలని కోరాడు. ఆమె పైకి లేచిన తర్వాత భుజంపై, నడుంపై చేయి వేయాలని ప్రయత్నించాడు. అతని అనుచిత ప్రవర్తనను గమనించిన అపర్ణ.. తప్పించుకుని నవ్వుకుంటూ వెళ్లి కూర్చుంది.
అయితే అదే స్టేజ్‌పై చెంప చెల్లుమనిపించాల్సిన సంఘటనలో కూడా అపర్ణ నవ్వుతూనే దానిని స్వీకరించింది. స్టేజ్ పై చేయి చేసుకుంటే బాగోదని భావించి ఉండవచ్చు.. అందుకే ఆమె వెనక్కి తగ్గింది. ఈ సంఘటనపై తాజాగా ఆమె స్పందిస్తూ.. ఎర్నాకులం న్యాయ కళాశాల విద్యార్థి అనుచిత ప్రవర్తన నన్నెంతగానో బాధించింది. అదొక తీవ్రమైన చర్యగా నేను భావిస్తున్నాను.
అయినా ‘లా’ చదివే వ్యక్తికి ఒక మహిళ అనుమతి లేకుండా ఆమెను తాకడం నేరమని తెలియదా? బలవంతంగా నా చేయి పట్టుకుని కుర్చీలో నుండి పైకి లేపడం సరైన పద్ధతి కాదు. నా భుజాలపై చేతులు వేయాలని ప్రయత్నించాడు. ఒక మహిళ పట్ల ప్రవర్తించాల్సిన పద్దతి అయితే ఇది కాదు. అయితే ఈ సంఘటనపై నేను పోలీసులకు ఫిర్యాదు చేసి.. దాని నిమిత్తం అటు, ఇటు పరుగెత్తాలని భావించడం లేదు. అంత సమయం కూడా నాకు లేదు. కానీ ఆ విద్యార్థి చర్యను మాత్రం ఖండిస్తున్నాను. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే కళాశాల నిర్వాహకులు నాకు క్షమాపణలు చెప్పారు.. అని అపర్ణ చెప్పుకొచ్చింది. కాగా, ఆ విద్యార్థిని కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసినట్లుగా కేరళ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.