ఈ సంక్రాంతికి తెలుగులో ఎన్నో అంచనాలు, ఎంతో పోటీ మధ్యన బాలకృష్ణ వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేర్ వీరయ్యలు విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాల్లో బాలకృష్ణ హీరోయిజానికి, చిరంజీవి హీరోయిజానికి ఫాన్స్ జై జై లు కొడుతున్నారు. బాలకృష్ణ ఒంటి చేత్తో వీరసింహారెడ్డిని నడిపిస్తే.. చిరు మరో హీరో రవితేజ హెల్ప్ తో దున్నేశారు. అయితే ఈ రెండు సినిమాల్లో హీరోయిజం ఎంతగా ఎలివేట్ అయ్యిందో.. విలనిజం అంతగా చిన్నబోయింది. హీరోకి సరితూగే విలన్ ఉంటే కథ లో ఆడియన్స్ ఇన్వాల్వ్ అవుతారు. కానీ ఎక్కడ చూసినా.. హీరోయిజమే కనిపిస్తుంది. దానికి తగ్గ విలన్ పాత్ర లేకపోతే ఆ హీరోయిజం కూడా బోర్ కొట్టేస్తుంది.
అదే వీరసింహారెడ్డి-వాల్తేర్ వీరయ్య విషయంలో జరిగింది. దునియా విజయ్ ఎలాంటి లుక్ వేసినా వీరసింహారెడ్డి హీరోయిజం ముందు తేలిపోయాడు. అసలు దునియా విజయ్ ఏ సన్నివేశంలోనూ ప్రభావం చూపలేకపోయాడు. ఇక వాల్తేర్ వీరయ్యలో డ్రగ్ మాఫియా నడిపే విలన్ పాత్రలో ప్రకాష్ రాజ్ పాత్ర చూసి ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు. ఇంకెన్నాళ్లు ఈ ముతక విలనిజం ప్రకాష్ రాజ్ అంటున్నారు. చిరంజీవి ముందు ప్రకాష్ రాజ్ తేలిపోయాడు. అసలు ఇలాంటి విలన్ ఈ సినిమాకి అవసరమా అనిపించేలా ప్రకాష్ రాజ్ పాత్ర ఉంది అంటే నమ్మాలి. మరో సినిమా వారసుడు లోను విజయ్ ని ఎలివేట్ చేసి ప్రకాష్ రాజ్ విలన్ పాత్రని వంశీ మరీ రొటీన్ గా చేసేసాడు.
మరి ఇంతకుముందు గోపిచంద్ మలినేని.. క్రాక్ సినిమాలో రవితేజకి సముద్రఖని, రవి శంకర్ లాంటి ఇద్దరి పవర్ ఫుల్ విలన్స్ ని పెట్టి రవితేజ హీరోయిజాన్ని ఎలివేట్ చేసినా.. సముద్రఖని ప్రతి సీన్ లో రవితేజ తో సరిసమానంగా కనిపించాడు. కానీ గోపీచంద్ ఇక్కడ వీరసింహారెడ్డికి వచ్చేసరికి బాలయ్యకి సరితూగే విలన్ ని ఎంపిక చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. అటు బాబీ రొటీన్ గా ప్రకాష్ రాజ్ ని సెలక్ట్ చేసి చిరు ఇమేజ్ తగ్గించేసాడు. విలన్స్ విషయంలో మరికాస్త కొత్తగా ఆలోచిస్తే ఈ రెండు సినిమాల రిజల్ట్ వేరే లెవల్లో ఉండేవి అనడంలో సందేహమే లేదు.