ఈ సంక్రాంతికి బాలకృష్ణ వీరసింహరెడ్డితోనూ, చిరంజీవి వాల్తేర్ వీరయ్యతో బాక్సాఫీస్ కుమ్ములాటకి దిగారు. పల్లెటూర్లలో కోడిపందేల బరి కన్నా ఎక్కువగా ఈసారి సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి-బాలకృష్ణ ల సినిమాలు మాత్రం జాతరని తలపించాయి. నందమూరి ఫాన్స్, మెగా ఫాన్స్ ఇద్దరూ వీరసింహారెడ్డి-వాల్తేర్ వీరయ్యల మ్యానియా తో ఊగిపోతున్నారు. సినిమా థియేటర్స్ దగ్గర బ్యానర్ లు కడుతూ జై బాలయ్య, జై మెగాస్టార్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఇంతటి సందడి వాతావరణాన్ని ప్రముఖులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్స్ అయిన ప్రభాస్, అల్లు అర్జున్ లు ఈ రెండు సినిమాల కోసం థియేటర్స్ కి వెళ్లడం హాట్ టాపిక్ అయ్యింది.
నందమూరి బాలకృష్ణ తో అన్ స్టాపబుల్ టాక్ షో చేసిన ప్రభాస్ బాలయ్య సినిమా కోసం హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న కొండాపూర్ లోని AMB మాల్ కి వెళ్లి ఆయన నటించిన వీరసింహ రెడ్డి మూవీ చూడడం చర్చనీయాంశం అయ్యింది. ఈ విషయాన్ని ప్రభాస్ టీమ్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ప్రభాస్ వీర సింహారెడ్డి సినిమా చూస్తున్నారని శుక్రవారం రాత్రి 9 గంటలకు ట్వీట్ పెట్టింది. ప్రభాస్ నైట్ షోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మరోపక్క మెగాస్టార్ వీరాభిమాని, ఆయన మేనల్లుడు అల్లు అర్జున్ కూడా వాల్తేర్ వీరయ్యని వీక్షించారు.
నిన్న శుక్రవారం విడుదలైన వాల్తేర్ వీరయ్యని అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి ప్రసాద్ మల్టీప్లెక్స్ లో చూశారు. దానితో మెగా ఫాన్స్ లో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. అన్న హీరో అయినప్పటికీ మెగా ఫ్యాన్ అంటూ వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. ఈ సీనియర్ స్టార్స్ సినిమాలను పాన్ ఇండియా స్టార్స్ వీక్షించడం వాళ్ళ ఫాన్స్ కి బాగా నచ్చేసింది.