నందమూరి బాలకృష్ణ కి ఎంత కోపమో.. అంత మంచి మనసు, చిన్నపిల్లాడి మనస్తత్వం.. అని ఆయన్ని కలిసిన ప్రతి ఒక్కరూ చెబుతారు. ఆయన అభిమానులని కొట్టినా వారు ప్రేమతో అనుకుంటారు తప్ప ఆయనపై కోపం పెంచుకోరు. మరి బాలయ్య అంత వైల్డ్ గా ఉంటే అభిమానులు కూల్ గా ఎందుకుంటారు. బాలయ్య ఫాన్స్ కూడా అంతకు మించి అనేంత రీ సౌండ్స్ చేస్తారు. జై బాలయ్య అంటూ హంగామా చేస్తారు. అసలే అఖండలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత, అన్ స్టాపబుల్ షో తర్వాత బాలయ్య అంటే అభిమానం మరింతగా పెరిగిపోయింది. అది ఇక్కడైనా ఎక్కడైనా అంతే ఉంది. ఎల్లలు దాటినా బాలయ్య మీద అభిమానం పోదు అనేంతగా యుఎస్ లో బాలయ్య అభిమానులు చేసే హడావుడిని సోషల్ మీడియాలో తరచూ చూస్తూనే ఉంటాము.
అయితే బాలయ్య సినిమాలొస్తున్నాయంటే బెన్ ఫిట్ షోస్ తో థియేటర్స్ దగ్గర జాతరని తలపించేలా మాస్ ఆడియన్స్ చేసే రచ్చ మాములుగా ఉండదు. టపాసులు పేలుస్తూ, కాగితాలు చించుతూ గొంతెత్తి అరుస్తూ, పూనకాలు వచ్చేసంతగా రచ్చ చేస్తారు. మరి మన తెలుగు రాష్ట్రాలైనా, అమెరికా అయినా ఫాన్స్ అంతే ఉంటారు. ఇలా రచ్చ చేస్తే థియేటర్స్ యాజమాన్యాలు హ్యాపీగా ఉంటాయి. కాని అమెరికాలో బాలయ్య అభిమానులకి ఘోర అవమానం జరిగింది. ఈరోజు గురువారం విడుదలైన వీర సింహ రెడ్డి షో చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు థియేటర్స్ కి క్యూ కట్టడమే కాదు, మాస్ జాతరని తలపిస్తూ బాలయ్య ఎంట్రీ ఇవ్వడం, యాక్షన్ సీన్స్ దగ్గర అరిచి గోల చేస్తూ హంగామా చేసేసరికి థియేటర్ యాజమాన్యానికి ఒళ్ళుమండి షో క్యాన్సిల్ చేసి వాళ్ళని బయటికి పంపెయ్యడం హాట్ టాపిక్ గా మారింది.
అలా బాలయ్య అభిమానులు అవమానంగా ఫీలవుతుంటే.. థియేటర్ యాజమాన్యం మాత్రం ఇప్పటివరకు మేము చాలా షోస్ వేసాం, ఏ హీరోల ఫాన్స్ ఇంతలా రచ్చ చెయ్యలేదు, ఫస్ట్ టైమ్ మా థియేటర్ లో ఇలా జరిగింది. ఇంత గోల చేస్తూ ఉంటే సినిమా ఎలా చూస్తారు ఆలోచించండి అంటూ చెబుతున్న వీడియోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.