ఇటీవల రోజా పవన్ కల్యాణ్‌ని ఉద్దేశించి మాట్లాడుతూ.. మెగా బ్రదర్స్ ముగ్గురూ ప్రజలకు అసలు ఏం చేశారు? అందుకే ఓడిపోయారు. వారిని చూస్తుంటే.. ఒక సినిమా నటిగా నాకు సిగ్గేస్తుంది.. అంటూ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆమె కామెంట్స్ విన్న తర్వాత మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు.. రోజాని అభిమానించే వారు కూడా ఆమెను ఛీ.. ఇలా మాట్లాడుతుందేంటి? అని అనుకున్నారంటే.. ఆమె వ్యాఖ్యలలో ఎంత నిజం ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజా క్షేత్రంలో గెలవకపోవచ్చు.. కానీ వ్యక్తులుగా వారు చేసే సహాయసహకారాలతో.. వారు శత్రువుల గుండెల్లో కూడా గుడి కట్టేసుకున్నారు. ఇది కాదనలేని నిజం. అయితే రోజా చేసిన ఈ కామెంట్స్‌పై.. తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి ఓపెన్ అయ్యారు.
‘‘నా పేరు వాడకపోతే.. వారి మాటలు ఎవరూ వేయరు. తనకి గుర్తింపు రాదు. అడ్డదారిలో గుర్తింపు కావాలి అంటే.. అడ్డదిడ్డంగా నా గురించి మాట్లాడటం, మా ఫ్యామిలీ పేరు ప్రస్తావించి మాట్లాడటంతోటి ఒక గుర్తింపు వస్తుంది. ఆ రకంగా కూడా వారు గుర్తింపు కావాలి అనుకుంటే.. ఓకే ఇచ్చెయ్ అని అనిపిస్తుంది. ప్రస్తుతం నేను ఆ స్థితికి చేరుకున్నాను. ఎందుకంటే.. నా స్నేహితులుగా ఉంటూ.. ఒకప్పుడు నాతో సినిమాలు చేసి.. క్లోజ్‌గా ఉండే వాళ్లు కూడా.. ఇప్పుడు మాట్లాడే మాటలు చూస్తుంటే.. అరె.. నిన్నకాక మొన్ననే కదా.. మన ఇంటికి వచ్చారు. మన గురించి ఇలా మాట్లాడుతున్నారేంటి? నేనేం సహాయ సహకారాలు చేయలేదా? ఎవరికీ హెల్ప్ కాలేదా? ఏ పరిస్థితులలో నేను చేయలేదో ప్రూవ్ చేయమనండి. నేను చేసే సహాయ సహకారాలకు పబ్లిసిటీ ఇచ్చుకోలేదు.. అది నా తృప్తి కోసం చేసిన పని. నేను ఏం సహాయం చేయలేదు అని నువ్వు అనుకుంటే కనుక.. ఓకే నీకు అంతే తెలిసింది.. నా మనసుకు తెలుసు నేను ఏం చేశాననేది. లబ్ధిదారులకు, నాకు మధ్య ఉండే బాండింగ్ చాలు. మిగతా అందరికీ తెలియాల్సిన అవసరం లేదు.. మరి నువ్వు తెలిసి అన్నావో.. తెలిసినా సరే అన్నావో.. అనేది నీ విజ్ఞతకే వదిలేస్తున్నా. అలాంటి వారిని నేను కేర్ చేయను.. అలాంటి వారిని అసలు పట్టించుకోను. ఎందుకంటే నా సమయం చాలా విలువైనది. దానికి మించి నా మానసిక ప్రశాంతత మరింత విలువైనది. ఎవరో ఏదో అన్నారు కదా.. అని, దానినే పట్టుకుని నా మానసిక ప్రశాంతతను దూరం చేసుకోలేను. నా మనశ్శాంతి నా హక్కు.. నా ఆస్తి. దానిని దూరం చేసుకోవాలనుకున్నా.. ఖర్చు చేసుకోవాలని అనుకున్నా.. అది నా చేతుల్లో ఉండాలి తప్ప.. నువ్వెవరు.. నన్నొక మాటతో నా ఆస్తి(మనశ్శాంతి) పై హక్కు సాధించాలని చూడడానికి. అది నీకు ఇవ్వను.. ఎందుకంటే అది నాది. నా సొంతం..’’ ఇలా అనుకుంటాను నేను.. అందుకే ఇలా ఉండగలుగుతున్నాను అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం మెగాస్టార్ చేసిన ఈ కామెంట్స్‌తో రోజాకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చినట్లయింది. మరో విశేషం ఏమిటంటే.. ఆయన ఈ మాటల్లో ఎక్కడా రోజా పేరు ప్రస్తావించలేదు. ప్రస్తుతం రోజాకి చిరు ఇచ్చిన క్లాస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా ఫ్యాన్స్ ఈ వీడియోని లైక్స్, షేర్స్ చేస్తూ.. ఇలా మిమ్మల్ని టార్గెట్ చేసే అందరికీ ఎప్పటికప్పుడు తిరిగి ఇచ్చేయండి బాస్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.