కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కి లెక్కలేనంత అభిమాన గణం ఉంది. ఆయన ఒకేరకమయిన మూస పద్ధతిలో యాక్షన్ మూవీస్ చేసుకుంటూ పోతున్నా తమిళ తంబీలు మాత్రం అజిత్ సినిమాలని ఆదరిస్తూనే ఉన్నారు. అందుకే అజిత్ కూడా అదే రొటీన్ ఫార్ములాతో సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు కానీ కొత్తదనం ట్రై చెయ్యడం లేదు. దర్శకులు ఎలా చెబితే అలా అంటూ సినిమా చేసేసి దాని రిజల్ట్ గురించి ఆలోచించని అజిత్ సినిమాలంటే అభిమానులకి ప్రాణం. నేడు అజిత్ తునివి పొంగల్ స్పెషల్ గా తెలుగు, తమిళ్ లో విడుదలైంది.
మరో హీరో విజయ్ వారిసుకి పోటీగా రిలీజ్ అయిన తునివి థియేటర్స్ దగ్గర ఫాన్స్ అజిత్ కటౌట్స్ తో హంగామా చేసారు. అజిత్ భారీ కటౌట్స్ పెట్టి పాలాభిషేకాలు చేసారు. ఓ థియేటర్ దగ్గర అజిత్ కటౌట్ పెట్టడానికి 70 లక్షలు ఖర్చుపెట్టాడో వీరాభిమాని. అయితే ఈరోజు తెల్లవారుఝామున చెన్నైలో తునివి స్పెషల్ ప్రీమియర్ చూడడానికి వెళ్ళిన అజిత్ అభిమాని ఒకరు మృతి చెందడం హాట్ టాపిక్ అయ్యింది. చెన్నై లోని కోయంబేడ్ రోహిణి థియేటర్ లో బుధవారం తెల్లవారుఝామున 1 గంటకు తునివి స్పెషల్ షో వెయ్యగా భరత్ కుమార్ అనే అభిమాని తన ఫ్రెండ్స్, ఇంకా అజిత్ అభిమానులు తో కలిసి తునివి సినిమా చూసి బయటికి వచ్చి హంగామా చెయ్యడం స్టార్ట్ చేసారు.
అలాగే రోడ్డెక్కి అజిత్ పేరుని ఉచ్చరిస్తూ గట్టిగా అరుస్తూ కేకలు వేస్తూ రచ్చ చేస్తూ ఉండడంతో ట్రాఫిక్ కి అంతరాయం కలిగింది. అయితే భరత్ కుమార్ ఆ ఊపులో అక్కడ నెమ్మదిగా వెళుతున్న వాటర్ టాంకర్ ఎక్కి అజిత్ పేరుని గట్టిగా అరుస్తూ ఉండగా వాటర్ టాంకర్ స్పీడుగా కదలడంతో భరత్ కుమార్ దానిపై నుండి కిందపడి తీవ్ర గాయాలపాలయ్యాడు. భరత్ ని ఫ్రెండ్స్ వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స తీసుకుంటూ భరత్ మరణించాడు. దానితో చెన్నైలో తీవ్ర విషాదం అలముకుంది.