ఆర్.ఆర్.ఆర్. చిత్రంలోని నాటు నాటు... గీతానికి ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కడం పట్ల సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆర్.ఆర్.ఆర్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. భారతీయులందరూ ఎంతో సంతోషించదగ్గ పరిణామం. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకొన్న ఈ గీతానికి స్వరకల్పన చేసిన శ్రీ ఎం.ఎం.కీరవాణి గారికి అభినందనలు. తెలుగు గీతానికి ఉన్న కీరిప్రతిష్టలను గోల్డెన్ గ్లోబ్ పురస్కారం మరింత ఇనుమడింపచేస్తుంది. నాటు నాటు గీతాన్ని రచించిన శ్రీ చంద్రబోస్, ఆలపించిన గాయకులు శ్రీ రాహుల్ సిప్లిగంజ్, శ్రీ కాలభైరవలకు ప్రత్యేక అభినందనలు.
ఆస్కార్ పురస్కారం కోసం పోటీపడుతున్న ఈ చిత్రం ఆ వేదికపైనా పురస్కారాలు పొందాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ చిత్రాన్ని ప్రపంచ స్థాయి ప్రశంసలు పొందేలా రూపుదిద్దిన దర్శకుడు శ్రీ రాజమౌళి, చిత్ర కథానాయకులు శ్రీ రాంచరణ్, శ్రీ ఎన్టీఆర్, నిర్మాత శ్రీ డి.వి.వి.దానయ్య అభినందనీయులు.. అంటూ RRR కి గోల్డెన్ గ్లోబ్ పురస్కారం అందుకోవడం పట్ల పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా తన స్పందన తెలియజేసారు.