‘ఎవరైతే వర్క్‌ని ప్రేమిస్తారో.. ఎవరైతే కష్టాన్ని నమ్ముకుంటారో.. అలాంటి వాడు నాకు అభిమాని. అలాంటివారికి నేను అభిమానిని..’ అన్నారు మెగాస్టార్ చిరంజీవి. తాజాగా వైజాగ్‌లో జరిగిన ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన మాట్లాడుతూ.. డైరెక్టర్ బాబీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా తర్వాత బాబీ స్టార్ డైరెక్టర్ అవుతాడని, అది చాలా దగ్గరలోనే ఉందని బాబీని చిరు ఆశీర్వదించారు.
ఇంకా మెగాస్టార్ మాట్లాడుతూ.. సాధారణంగా ఎవరి సినిమాలైనా సరే.. బాగున్న కథ సోసోగా.. యావరేజ్‌గా, ఎబౌ యావరేజ్‌గా లేదంటే హిట్ రేంజ్‌లో ఆగిపోతాయి. కానీ అదే కథని నిరంతరం చెక్కుతూ ఉంటే కనుక.. అవి ఎంత షైనింగ్ అయితే.. అవి మరింత బ్రహ్మాండంగా వస్తాయి. ఎందుకంటే.. ఎవరైతే కథకుడు ఉన్నాడో.. ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో.. వాడు విశ్రాంతి చెందకూడదు.. వచ్చేసింది కదా అని సంతృప్తి చెందకూడదు. ఏ డైరెక్టర్‌కి అయితే ఒక మంచి కథ మీద సంతృప్తి ఉండదో.. అసంతృప్తితో ఉంటూ.. ఇంకా ఏదో చేయాలని తపన పడతాడో.. వాడి కథ ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అదే జరిగింది ఇక్కడ. ఈ రోజు వరకు కూడా అతని విశ్రాంతి పొందలేదు. చాలా బాగుంది కదా.. చాలా బాగా వచ్చింది కదా.. ఇక వదిలేయ వచ్చు కదా.. ఇంకా ఎందుకు ఎడిటింగ్ రూమ్‌కి వెళ్లి ఓ కష్టపడుతున్నావంటే.. ‘లేదన్నయ్యా.. ఎక్కడో కొంచెం కొడుతుంది. అది కూడా కరెక్ట్ చేస్తే.. ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను’ అంటాడు. ఏమనుకుంటున్నావ్ కరెక్షన్స్ అంటే.. అక్కడ కరెక్షన్స్ చూపిస్తాడు. నిజంగా చాలా బాగుంటుంది.. నాకెందుకు రాలేదు ఈ ఆలోచన అనిపిస్తుంది. చాలా బాగా ఆలోచించాడు.. వెరీ గుడ్ అనిపిస్తుంది. తాజాగా ల్యాబ్‌లో సినిమా చూస్తున్నాం.. అక్కడ కూడా చిన్న చిన్న లోపాలు కనబడుతున్నాయని.. ఆదివారం మార్నింగ్ 5 గంటల వరకు ఎడిటింగ్ రూమ్‌లో ఉండి.. అవన్నీ కరెక్ట్ చేసుకుని.. ఇక ఓకే అనుకున్న తర్వాత.. ఫ్లైట్ ఎక్కి ఈ వేడుకకు వచ్చాడు.
ఎందుకంత ఇష్టం అంటే అతను నా అభిమాని.. నన్ను ప్రేమిస్తున్నాడనేది కానే కాదు. నాకు అభిమానులు చాలా మంది ఉంటారు. అది కాదు కావాల్సింది.. ఎవరైతే వర్క్‌ని ప్రేమిస్తారో.. ఎవరైతే కష్టాన్ని నమ్ముకుంటారో.. అలాంటి వాడు నాకు అభిమాని. అలాంటివారికి నేను అభిమానిని. రెండు సంవత్సరాలుగా.. అతనిని అడుగడుగునా గమనిస్తున్నాను. బాబీ కష్టానికి, బాబీ పనితనానికి, బాబీ డెడికేషన్‌కి, బాబీ తీసుకున్న శ్రద్దాసక్తులకి.. నేను బాబీ అభిమానినయ్యాను. ప్రతి ఒక్కరూ అతనిని స్ఫూర్తిగా తీసుకుని.. వచ్చిన సబ్జెక్ట్‌కు సంతృప్తి చెందక.. ఇంకా ఏదో చేయాలని పరితపిస్తూ ఉండండి.. ఖచ్చితంగా ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అలాంటి డెడికేషన్ ఉన్న వ్యక్తితో నేను ట్రావెల్ చేశాను. నా అభిమాని అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను. టెక్నీషియన్స్ అందరితో బాబీ ఒక్కడు అన్నీ రాబట్టుకుని తన పనితనం చూపించాడు. వీళ్లందరి సమిష్టి కృషితోటి ప్రొడ్యూసర్స్‌కి డబ్బులు మిగులుతాయి. నాకు కీర్తి మిగులుతుంది. వాళ్లందరికీ లాంగ్ లైఫ్ మిగులుతుంది.. మరెంతో భవిష్యత్ ఉంటుంది. ఈ సినిమా తర్వాత బాబీ స్టార్ డైరెక్టర్ అవడం అనేది ఎంతో దూరంలో లేదు. ఈ సినిమా తర్వాత అతను స్టార్ డైరెక్టర్ అవుతాడు. వాళ్ల నాన్నగారు ఈ మధ్యే గతించారు. ఆయన ఆశీస్సులు అతనికి ఎప్పుడూ ఉంటాయి. ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటాయి. అతను స్టార్ డైరెక్టర్ అవడానికి శ్రీకారం చుట్టినటువంటి వేదిక ఇది.. అని చెప్పుకొచ్చారు.