రీసెంట్‌గా జరిగిన ‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ వేడుకలో ఒంగోలియన్, మంగోలియన్ అంటూ నటసింహం నందమూరి బాలకృష్ణ ఓ చిరకాల వాంఛను బయటపెట్టారు. అదేంటో కాదు.. తనకు చెంఘీజ్ ఖాన్ పాత్ర చేయాలని ఉందని, ఎప్పటికైనా ఆ పాత్రను చేసి తీరతాను అని బాలయ్య చెప్పుకొచ్చారు. దీంతో అసలు ఈ ఛెంఘీజ్ ఖాన్ ఎవరూ అంటూ అంతా ఇప్పుడు సెర్చింగ్ మొదలెట్టారు. బాలయ్యకు ఛెంఘీజ్ ఖాన్ అంటే ఎంత ఇష్టమో.. ఈ వేడుకలో బయటపడినా.. అంతకు ముందే ఆయన ఈ పాత్రను ఓ సినిమాలో చేసేశాడు. ‘శ్రీమన్నారాయణ’ అనే చిత్రంలో విలన్స్‌ని హతమార్చి పాస్‌వర్డ్ రాబట్టే ప్రక్రియలో బాలయ్య కనిపించే తీరు.. చెంఘీజ్ ఖాన్ గెటప్‌లానే ఉంటుంది.
అసలింతకీ ఈ చెంఘీజ్ ఖాన్ ఎవరంటే.. ప్రపంచంలోనే అతి పెద్దదైన మంగోలియన్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి చెంఘీజ్ ఖాన్. సంచార జాతులన్నింటినీ ఒకటిగా చేసి తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. చరిత్ర చెబుతున్న సమాచారం ప్రకారం ఏదైనా సామ్రాజ్యంపై చెంఘీజ్ ఖాన్ కన్నుపడిందంటే.. ఇక అది తన హస్తగతమైనట్లే. ఏ రాజైనా తనకు లొంగకపోతే.. ఆ రాజ్యాన్ని, అందులోని స్త్రీలను హింసించడం, వారిపై క్రూరత్వం ప్రదర్శించడం చేసేవాడట. మహిళలను ఎత్తుకొని వెళ్లి.. అతని సైన్యం చేసే అఘాయిత్యాలు, క్రూరత్వం భరించలేక ఎంతోమంది రాజులు తమ సామ్రాజ్యాన్ని మంగోలియన్ సామ్రాజ్యంలో కలిపి వేసి సామంతులుగా మారినట్లుగా చరిత్ర చెబుతుంది.
తన సామ్రాజ్య విస్తరణకు ఎన్నో యుద్ధాలు చేశాడని.. ఆయన జీవితమంతా యుద్ధాలు, పోరాటాలతోనే సాగిందని తెలుస్తోంది. ఎంత అరాచకం సృష్టించినా.. మంగోలియన్లకు మాత్రం ఆయన దైవంతో సమానం. అలాగే యుద్ధతంత్ర నీతిలో ఆయనను మించిన చాణుక్యుడు కూడా లేడని ప్రశస్తి. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో ఎదుటివాడు ఎంతటి వాడైనా, యుద్ధ నీతిని ప్రదర్శించి ఆ రాజ్యాన్ని తన రాజ్యంలో కలిపేసుకునేవాడట. ఈ విషయంలో ఆయనను మించిన ధీరుడు లేడని మంగోలియన్లు భావిస్తారు. అయితే ఆయన కథ వింటుంటే.. ఇందులో నాయకుడి కంటే ప్రతినాయకుడు ఛాయలే ఎక్కువగా కనబడుతున్నాయి. మరి ఈ కథపై బాలయ్య ఎందుకు ముచ్చటపడుతున్నాడో ఆయనకే తెలియాల్సి ఉంది. ఒకవేళ అంతా ఓకే అయితే.. ఈ కథని ఏ డైరెక్టర్ డీల్ చేస్తాడనేది కూడా ఇక్కడ విశేషమే. ఒక్కటి మాత్రం నిజం.. ఇలాంటి కథలను డీల్ చేయాలంటే క్రిష్ తర్వాతే ఎవరైనా. బాలయ్య పట్టుపడితే.. క్రిష్ ఈ సినిమా చేయడానికి సిద్ధంగానే ఉంటాడు. చూద్దాం.. ఈ కథ ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందో..