తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘వారసుడు’ చిత్రాన్ని జనవరి 14కి వాయిదా వేస్తున్నట్లుగా అధికారికంగా నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. అయితే తమిళ్ ‘వారిసు’ మాత్రం వరల్డ్ వైడ్‌గా జనవరి 11నే విడుదలవుతుందని ఆయన వెల్లడించారు. ఈ విషయం తెలిపేందుకు తాజాగా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దిల్ రాజు మాట్లాడుతూ..
‘‘నాలుగైదు రోజులుగా ఇండస్ట్రీలో వారసుడు విడుదలపై రకరకాల వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. నా పక్కన కొందరు ఉంటారు.. నేను మనసులో ఏదైనా అనుకుంటే చాలు.. వాళ్ల ద్వారా బయటికి వచ్చేస్తుంది. నేను బయటికి చెప్పే వరకు ఆగడం లేదు. ఈ సినిమాని సంక్రాంతికి తీసుకురావాలని ఫిక్సయ్యాను. జనవరి 14న సినిమాని విడుదల చేయబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా తమిళ వెర్షన్ ‘వారిసు’ జనవరి 11న విడుదలవుతుంది. తెలుగు ‘వారసుడు’ మాత్రం జనవరి 14న విడుదలవుతుంది. సంక్రాంతి వారసుడిని చేస్తున్నాం. జనవరి 14కి వెళ్లడానికి కారణం.. ఇండస్ట్రీలోని పెద్దలందరితో డిస్కస్ చేసి ఈ నిర్ణయం తీసుకున్నాం. 11న అక్కడ విడుదలై.. 14న ఇక్కడ అంటే.. సినిమా బయటికి వచ్చేస్తుంది కదా.. అని అంతా అడిగారు. అది నాకు సినిమాపై ఉన్న నమ్మకం. తమిళ్‌లో సూపర్ హిట్ కొట్టబోతున్నాం కాబట్టి.. సూపర్ హిట్ సినిమాని ఎప్పుడు ఎక్కడ విడుదల చేసినా ప్రాబ్లమ్ లేదు. మంచి సినిమా కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తారని నా నమ్మకం.
ఇలా విడుదల చేయడానికి కారణం మీ అందరికీ తెలిసిందే. కొన్ని రోజులుగా నన్ను ఎలా టార్గెట్ చేస్తున్నారో తెలియంది కాదు. ఈ నిర్ణయం నేను తీసుకోవడానికి కారణం జనవరి 12న బాలయ్యగారి సినిమా.. 13న చిరంజీవిగారి సినిమాలు ఉన్నాయి. ప్రతి థియేటర్‌లో ముందు వారి సినిమాలు పడాలి. బిగ్ స్టార్స్ వాళ్లు.. వారికి ప్రతిచోటా థియేటర్లు దొరకాలి. తర్వాతే నా సినిమా ఉండాలనేదే నా మెయిన్ ఇన్‌టెన్షన్. నేను చాలా ఇంటర్వ్యూలలో చెప్పాను.. వారిద్దరి సినిమాలకు నా ‘వారసుడు’ సినిమా పోటీ కాదు అని. వారసుడు మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అందుకే ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నాను. కానీ టాలీవుడ్ స్టార్ హీరోలకి భారీ స్థాయిలో థియేటర్లు కావాలి. అందుకే పాజిటివ్ థృక్పథంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది’’ అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.