పాలిటిక్స్‌కి మెగాస్టార్ చిరంజీవి సరిపడరని అన్నారు డైరెక్టర్ బాబీ. ఆయన దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాబోతోంది. ఈ చిత్ర ప్రీ రివీల్ కార్యక్రమంలో ఆదివారం వైజాగ్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి గొప్పతనం గురించి చెబుతూ.. రాజకీయాలలో ఉండాలంటే మాటకి మాట అంటించేవారయితేనే కరెక్ట్ అని అన్నారు. అందుకు చిరంజీవిలాంటి సున్నితమనస్కులు సరిపోరని తెలుపుతూ.. అందుకు పవర్ స్టార్ ఉన్నారని చెప్పుకొచ్చారు.
బాబీ మాట్లాడుతూ.. ‘‘అన్నయ్యని దగ్గరగా ఉండి చాలా విషయాలు నేర్చుకున్నాను. మెగాస్టార్ వంటి వ్యక్తికి ఎందుకు కోపం రాదు? ఎవరెవరో ఏదేదో అంటుంటే.. తిరిగి ఎందుకు మాట్లాడరు అంటే.. ఒక రోజు ఓ అందమైన మాట చెప్పారు. అవతలి వాడు అన్నాడు కదా అని మనం అనేస్తే.. వారికి తల్లిదండ్రులు ఉంటారు.. భార్యాబిడ్డలు ఉంటారు.. చెల్లెళ్లు ఉంటారు. వాళ్లంతా బాధపడతారు బాబీ అన్నారు. ఎలా అలవరచుకున్నారో గానీ.. నిజంగా హ్యాట్సాఫ్ అన్నయ్యా. నిజంగా మీరు రాజకీయాలలోకి వెళ్లినప్పుడు.. నేను మీతో సినిమా చేయలేనేమో అని అనుకున్నాను. ఎక్కడో ఆ ఫీలింగ్ అలాగే ఉండిపోయేది. మీకు రాజకీయాలు ఒక్క శాతం కూడా కరెక్ట్ కాదు. మీకు దేవుడు ఒక తమ్ముడిని ఇచ్చాడు.. అతను చూసుకుంటాడు. అతను సమాధానం చెబుతాడు. అతను గట్టిగా నిలబడతాడు. మీలో నుంచి వచ్చిన ఆవేశం, మంచితనం కలిస్తే పవర్ స్టార్. అతను మాటకి మాట, కత్తికి కత్తి, పదునుకు పదును పవర్ స్టార్. నేను అన్నయ్య కంటే ముందు పవర్ స్టార్ గారితో పని చేశాను. అదే మంచితనం.. అదే జనాలపై ఉన్న ప్రేమ.. ఇద్దరిలో సేమ్ టు సేమ్. ఎక్కడో తమిళనాడులో ఉన్న పొన్నాంబళం గారికి సమస్య వస్తే అన్నయ్య రియాక్ట్ అయిన తీరు.. ఊరికే అయిపోరు మెగాస్టార్స్. అది మెగాస్టార్. వుయ్ లవ్ యు అన్నయ్యా. ఇండస్ట్రీకి ఒక్కడే మెగాస్టార్.. అంతే. అదే మా ప్రేమ.. అదే ‘వీరయ్య’గా స్ర్కీన్ మీదకి తీసుకొచ్చాం..’’ అని అన్నారు.
ఇక పవర్ స్టార్ పేరు బాబీ తీసుకురాగానే స్టేడియం అంతా హోరెత్తిపోయింది. తన స్పీచ్ మధ్యమధ్యలో కూడా తనకి ఎనర్జీ రావడం కోసం.. పవర్ స్టార్ అంటూ రెండు మూడు సార్లు.. అని ఆ తర్వాత తన సుధీర్ఘ స్పీచ్‌ని బాబీ కొనసాగించాడు.