నేను కూడా వైజాగ్‌లో సెటిల్ అవ్వాలని అనుకుంటున్నాను. అందుకోసం భీమిలి వెళ్లే దారిలో స్థలం కొనుక్కున్నానని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం వైజాగ్‌లో చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..
‘‘వాల్తేరు.. హాలీడే హోమ్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అంటారు రిటైర్‌మెంట్ అయిన తర్వాత సెటిల్ అవ్వాల్సిన స్వర్గధామం. ఇక్కడి ప్రజలు శాంతి కాముఖులు. విశాలమైన మనసున్నవాళ్లు. కుళ్లు, కుతంత్రాలకు తావివ్వరు. సరదాగా ఉంటారు. సినిమాలు బాగా చూస్తుంటారు. ఇక్కడ కాస్మోపాలిటన్ కల్చర్ ఉంటుంది. ప్రతి ఒక్కరిలోనూ డిగ్నిఫైడ్ బిహేవియర్ కనబడుతుంటుంది. అందుకనే నాకు ఇక్కడ సెటిల్ అవ్వాలని అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు చెబుతున్నాను. ఇన్నాళ్లూ మాట మాత్రమే అన్నాను. ఈ మధ్యే ఒక స్థలం కొనుక్కున్నాను. అది భీమిలి వెళ్లే దారిలో. ఇంకా ఇల్లు కట్టే ప్రయత్నం చేయలేదు.. చేయాలి. నేను కూడా మీలాగా విశాఖ వాసుడిని అవుతాను. ఇంత అద్భుతమైన విశాఖపట్టణానికి నేను కూడా ఒక పౌరుడిని అయితే.. నా ఆనందం అంతా ఇంతా కాదు. చిరకాల కోరిక ఇది. ఎప్పుడు నేను వైజాగ్ వచ్చినా సరే.. నేను పొందే ఆనందం అంతా ఇంతా కాదు..’’ అని అన్నారు.
చిరు అలా వైజాగ్ వచ్చేస్తానని చెబుతుంటే.. ఫ్యాన్స్ అరుపులు, కేకలు, ఈలలతో మోత మోగించారు. త్వరలోనే తను కొనుక్కున్న స్థలంలో ఇళ్లు కట్టుకోవడానికి వైజాగ్ వస్తానని చిరు ఈ సందర్భంగా తెలియజేశారు.