ఇది కదా మాస్ అంటే.. ఇది కదా మెగాస్టార్ అంటే.. ఇది కదా.. మాస్ మహారాజా అంటే. ‘వాల్తేరు వీరయ్య’ ట్రైలర్ విడుదల తర్వాత ప్రతి ఒక్కరూ అనుకుంటున్నది ఇదే. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్‌లో బాబీ కొల్లి తెరకెక్కించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతికి థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ని శనివారం సాయంత్రం మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ విడుదల తర్వాత సంక్రాంతి పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందా.. ముఖ్యంగా జనవరి 13 ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అంతా వెయిట్ చేస్తున్నారంటే.. అందులో ఎటువంటి అతిశయోక్తి లేనే లేదు. ఎందుకంటే ట్రైలర్ అలా ఉంది మరి. వింటేజ్ చిరంజీవిని మళ్లీ వెనక్కి తెచ్చి.. శివతాండవం ఆడించేశాడు బాబీ. కొన్నాళ్లుగా మిస్ అవుతున్న చిరు కామెడీ టైమింగ్‌ని పట్టుకొచ్చి, మాస్-యాక్షన్ కాంబినేషన్‌తో పాటు బలమైన కంటెంట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లుగా.. ట్రైలర్ క్లారిటీ ఇచ్చేసింది. మరీ ముఖ్యంగా ఈ మధ్య ఫ్యాన్స్ కోరుకుంటున్న ఎలివేషన్ సీన్స్‌కి ఇందులో లిమిటే లేదు.. బాస్ కనిపించిన ప్రతిసారి పూనకాలే అన్నట్లుగా.. ట్రైలర్‌ని కట్ చేశారు.
ఇక ట్రైలర్‌లో డైలాగ్స్ కూడా మాములుగా లేవు. ఇంటర్నేషనల్ క్రిమినల్, డ్రగ్ స్మగ్లర్, మాన్‌స్టర్ అంటూ మెగాస్టార్‌ని ట్రైలర్‌లో పరిచయం చేసిన తీరుకి ప్రతి ఒక్కరికీ గూజ్‌బంప్స్ ఖాయం. సముద్రం నడిబొడ్డున బోట్‌లో సిగరెట్ వెలిగిస్తూ.. చిరుని చూపించిన తీరుకి రేపు థియేటర్లు బద్దలవడం ఖాయం. ఇక ఈ మధ్య ‘మాస్’ ట్యాగ్ కోసం కొట్టుకుంటున్న వారందరికీ పంచ్ పడేలా.. ‘మాస్ అనే పదానికి బొడ్డుకోసి పేరెట్టిందే మెగాస్టార్‌ని చూసి’ అంటూ అందరికీ క్లాస్ ఇచ్చేశారు. చిరు చేసే కామెడీ, విలన్స్‌ని పరిచయం చేసిన తీరు, ఎమోషనల్ సీన్స్, సెంటిమెంట్ అన్నింటికీ ఈ సినిమాలో కొదవలేదనేలా చెబుతూ.. ‘మీ కథలోకి నేను రాలా.. నా కథలోకే మీరు వచ్చారు’ అనే డైలాగ్‌తో.. సంక్రాంతి బరిలో నేను ముందే ఉన్నా.. నా తర్వాతే మీరంతా వచ్చారనేలా.. పోటీకి దిగుతున్న చిత్రాలకు చిన్న ఝలక్ కూడా ఇచ్చేశారు. ఆ తర్వాత ‘వీడు నా ఎర.. నువ్వే నా సొర’ అంటూ వీర వార్నింగ్, ‘రికార్డ్స్‌లో నా పేరు ఉండటం కాదు.. నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయ్’ అంటూ ఇచ్చిన ఎలివేషన్.. థియేటర్లలో ప్రేక్షకుల చేతులకి పని తెప్పించడం ఖాయం.
ఇక మాస్ రాజా రవితేజ ఎంట్రీతో.. ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ‘వైజాగ్‌లో గట్టి వేటగాడు లేడని.. ఒక పులి పూనకాలతో ఊగుతుందట..’ అని రవితేజ చెప్పిన డైలాగ్‌తో.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పులి ఎవరో, వేటగాడు ఎవరో.. ఒక్కసారి ఫ్యాన్స్ అంతా ఊహించుకునేలా చేశారు. ‘హలో మాస్టారూ.. ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి.. ఒక్కొక్కనికి బాక్స్‌లు బద్దలైపోతాయ్.. ’ అని చిరు డైలాగ్స్ రవితేజ చెబితే.. ‘ఏంట్రా బద్దలయ్యేది.. ఈ సిటీకి నీలాంటి కమిషనర్లు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ ఇక్కడ వీరయ్య లోకల్..’ అంటూ రవితేజ డైలాగ్ చిరు చెప్పి.. మెగా, మాస్ రాజా ఫ్యాన్స్ మురిసిపోయేలా చేశారు. మొత్తంగా అయితే.. ఈ ట్రైలర్‌తో పెద్ద పండగకి ముందు ఓ మినీ పండగని ఫ్యాన్స్‌కి ఇచ్చేశారు. సంక్రాంతికి ఫ్యాన్స్‌కి పూనకాలు గ్యారంటీ అనేలా ట్రైలర్‌తో అరిపించేశారు. ఆ పూనకాలు ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయనేది తెలియాలంటే.. జనవరి 13 వరకు వెయిట్ చేయక తప్పదు.