ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయి గ్లోబల్‌కి చేరుకుంది.. అలాగే తెలుగు పాట కూడా గ్లోబల్ స్థాయికి చేరుకుందని అన్నారు లిరిసిస్ట్ చంద్రబోస్. పాటని విమర్శించేవారు చాలా మంది ఉంటారు.. కానీ ఇప్పుడొక పాట రాయాలంటే.. గ్లోబల్ స్థాయిలో ఆలోచించాలని, ఏది పడితే అది రాస్తే.. ఆ స్థాయికి చేరుకోలేం అని ఆయన తన తాజా ఇంటర్వ్యూలో తెలియజేశారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంతో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ఓ పవర్ ఫుల్ సాంగ్ రాశారు. టైటిల్ ట్రాక్‌గా విడుదలైన ఈ పాటలోని సాహిత్యం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆఫ్‌కోర్స్ కొందరు ఈ పాటపై విమర్శకులు కూడా చేస్తున్నారనుకోండి. అలా విమర్శలు చేసే వారందరికీ చంద్రబోస్ తనదైన స్టైల్‌లో సమాధానమిస్తూ వస్తున్నారు.
ఇక ఈ పాటలో ఆయన రాసిన సాహిత్యం.. తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒక పాట గురించి, అందులోని సాహిత్యం గురించి చర్చ జరుగుతుందంటే.. ఖచ్చితంగా ఆ పాట సక్సెస్ అయినట్లే. గతంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి ‘సింధూరం’ సినిమా కోసం రాసిన ఓ పాటలోని సాహిత్యానికి అర్థం తెలుసుకోవడానికి భీమవరంలోని లైబ్రరీలో ఉన్న శబ్ధరత్నాకరమనే బుక్ గురించి తెలుసుకున్నానని దర్శకుడు త్రివిక్రమ్ పబ్లిక్‌గా ప్రకటించారు. ఒక పాటకి అంత పవర్ ఉంటుందని ఆయన మాటల తర్వాతే అందరికీ తెలిసింది. సేమ్ టు సేమ్ ఇప్పుడు చంద్రబోస్ రాసిన పాట కూడా అదే స్థాయిలో అందరినీ.. అర్థం కోసం వెతికేలా చేస్తుంది.
ఈ పాటలో.. ‘అనాధ గాథల అనంతలోతుల సముద్ర సోదరుడే వీడే
వినాశకారుల శ్మశానమౌతాడే..
తుఫాను అంచున తపస్సు చేసే వశిష్ఠుడంటే అది వీడే..
తలల్ని తీసే విశిష్ఠుడే వీడే..’ అనే పదప్రయోగం చూస్తుంటే.. తెలుగు భాషకి ఉన్న విశిష్టత ఏమిటో తెలియవస్తుంది. ఇంకా ఈ పాటలో చంద్రబోస్ చేసిన పదప్రయోగం ప్రతి ఒక్కరినీ ఆకర్షించడమే కాదు.. ఆలోచించేలా చేస్తుంది. ఈ పాట గురించి ప్రస్తావిస్తూ.. తెలుగు పాట ఇప్పుడు ఆస్కార్ స్థాయికి చేరింది. నాటు నాటు పాట ఆస్కార్‌కి నామినేట్ అయింది. ఊ అంటావా.. పాట ఏ రకంగా సెన్సేషన్‌ని క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇప్పుడు ప్రపంచం అంతా తెలుగు పాట వింటుంది. తెలుగు పాట రాయాలన్నా కూడా.. గ్లోబల్ స్థాయిలోనే ఆలోచించాలి. అప్పుడే అక్కడ ఉండగలం.. అని చంద్రబోస్ చెబుతున్నారు.