మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ.. పైకి వీరిద్దరూ స్నేహితులే. ఒకరి ఇంట్లో ఫంక్షన్‌కి మరొకరు హాజరై సందడి చేయడం అనేది మొదటి నుంచీ ఉంది. కానీ, చిరుపై పై చేయి సాధించాలని బాలయ్య ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. నటులుగా ఎవరినీ తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇద్దరూ ఇద్దరే. కానీ.. ఫస్ట్ ఎవరు? అని చెప్పాల్సి వస్తే మాత్రం ముందు చిరంజీవి పేరే అంతా చెబుతారు. ఎందుకూ అంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా బాలయ్య.. ఎన్టీఆర్ వారసుడిగా చెప్పబడతాడు. చిరంజీవి అలా కాదు, ఎవరి అండా లేకుండా కష్టపడి పైకి వచ్చి.. స్టార్‌గా ఎదిగాడని ఇండస్ట్రీ అంతా చెప్పుకుంటుంది. అలా అనీ, బాలయ్య ఏం కష్టపడకుండా అంతటి స్టార్ స్టేటస్‌ని తెచ్చుకోలేదు. అసలు చెప్పాలంటే.. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు.. రేటింగ్ ఇవ్వాల్సి వస్తే.. ఇద్దరూ సరిసమానమే. కానీ బాలయ్య చేసే చేష్టలే.. ఆయన స్థాయిని తగ్గిస్తున్నాయని చెప్పుకోవాలి. ఇండస్ట్రీలో మీకు మంచి స్నేహితుడు ఎవరినీ అంటే మాత్రం.. బాలయ్య చెప్పే పేరు చిరంజీవిదే. కానీ సినిమాల విషయానికి వస్తే మాత్రం.. చిరంజీవి పేరు వినబడితే ఆయన తట్టుకోలేడు. అది ప్రతి విషయంలో కనబడుతూనే ఉంటుంది.
బాలయ్య సినిమా హిట్టయితే.. ఆ విషయాన్ని పబ్లిక్‌గా చిరంజీవి చెప్పగలడు.. కానీ బాలయ్య మాత్రం చిరంజీవి సినిమా గురించి చెప్పడు.. చెప్పలేడు. ఎందుకంటే.. అతనికి ఉన్న ఈగో అలాంటిది. గతంలో పలుమార్లు.. ఇండస్ట్రీకి బాలయ్య సినిమా ఊపిరిపోసింది అంటూ చిరంజీవి.. పబ్లిక్‌గా చెప్పారు. ఎలాంటి అరమరికలు లేని మనసు చిరంజీవిది. అంతా నా వాళ్లే, నా మనుషులే అనుకునే భావన ఆయనది. కానీ ఈ విషయంలో బాలయ్య మనస్థత్వం వేరు. మిగతా అన్ని విషయాలలో మాత్రం బాలయ్య స్వచ్ఛమైన వ్యక్తిత్వంతో కనబడతాడు. అంతెందుకు, రేపు సంక్రాంతికి చిరు, బాలయ్యల సినిమాలు విడుదల కాబోతున్నాయి. థియేటర్ల విషయంలో దిల్ రాజు పోటీగా వస్తూ.. డబ్బింగ్ సినిమా కోసం అస్సలు తగ్గేదేలే అనేలా బిహేవ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో చిరు, బాలయ్య ఒక్కటి కావాలి కానీ.. బాలయ్య ‘నాకెన్ని?’ అంటూ.. తన సినిమా గురించే చూసుకుంటుండటం విశేషం.
ఆయన హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె’ షోకి ఇటీవల అల్లు అరవింద్, సురేష్ బాబు వచ్చినప్పుడు.. ‘అదంతా కాదు.. నా సినిమాకు ఎన్ని థియేటర్లు ఇస్తున్నారు?’ అని అడిగాడు. అలాగే, ప్రభాస్ ఎపిసోడ్‌లో రామ్ చరణ్‌కి కాల్ చేసి.. ‘నా సినిమా ముందు చూసి.. తర్వాత మీ నాన్న సినిమా చూడు’ అని అడిగాడు. సినిమాల విషయంలో బాలయ్య అలా ఉంటాడు. అదే చిరంజీవి విషయానికి వస్తే.. ‘వాల్తేరు వీరయ్య’కు సంబంధించి జరిగిన మీడియా సమావేశంలో ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు చిరు సమాధానమిస్తూ.. సంక్రాంతికి నా సినిమానే కాదు, బాలయ్య సినిమా కూడా మంచి విజయం సాధిస్తుంది. రెండు సినిమాలు మంచి విజయం సాధిస్తాయి. అందులో డౌటే లేదు అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఇదే చిరంజీవికి, బాలయ్యకి ఉన్న తేడా అంటూ అంతా మాట్లాడుకుంటుండటం గమనార్హం.