ఎంత స్టార్‌డమ్ ఉన్నా.. ఎన్ని వందల సినిమాలు చేసినా.. నటుడనేవాడు ఎప్పుడూ కష్టపడాలి. అలా కష్టపడని రోజు రిటైర్ అయ్యి ఇంట్లో ఉండిపోవచ్చు. ఇది ఇండస్ట్రీలోని అందరికీ చెబుతున్నానని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. 60 సంవత్సరాలు వయసు దాటినా.. ఇప్పటికీ సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలా అయితే కష్టపడ్డానో.. అలానే ఇప్పటికీ కష్టపడుతున్నానని, అలా కష్టపడితేనే మన వృత్తికి న్యాయం చేసినట్లుగా మెగాస్టార్ వ్యాఖ్యానించారు. ఆయన హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జర్నలిస్ట్స్ అడిగిన ప్రశ్నలకు చిరు సమాధానమిచ్చారు.
ఇంత స్టార్ డమ్, ఆకాశమంత పేరు వచ్చిన తర్వాత కూడా మైనస్ 8 డిగ్రీల టెంపరేచర్‌లో నటించడం అవసరమా? అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. నటుడనేవాడు ఎప్పుడూ అవకాశాల కోసం ఆకలితో ఉన్నట్లుగా ఉండాలని సూచించారు. అయ్యో.. ఇంత వయసులో చిరంజీవి అలా చేస్తున్నాడేంటి? అని నాపై ఎవరైనా సింపతీ చూపిస్తుంటే.. నాకు చాలా బాధగా ఉంటుంది. కెరీర్ మొదట్లో ఎలా అయితే కష్టపడ్డానో.. ఇప్పటికీ అలాగే కష్టపడుతున్నాను. కానీ నా కష్టాన్ని, బాధని ఎప్పుడూ వ్యక్తపరచలేదు. స్టార్‌డమ్ రావాలంటే మాములుగా రాదు.. కష్టపడితేనే వస్తుంది. నటుడనేవాడు ఎప్పుడూ ఆకలితో ఉండాలి. ఆ ఆకలి చచ్చిపోయిన రోజు.. ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోండి.
కష్టాలు, బాధలు ఉంటాయి. మైనస్ 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో చేసినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. కానీ అది పైకి చూపించలేదు. చలికి అన్ని పట్టేశాయి.. ఇంటికి వెళ్లిన తర్వాత వేడి నీళ్లు కాళ్లపై పోసుకోవడం, హీట్ వంటి వాటితో మ్యానేజ్ చేసుకుంటాం. అంతేకానీ.. ఆ బాధని సెట్స్‌లో ఎక్స్‌ప్రెస్ చేయలేదు. ఒక్కసారి సినిమా అంగీకరించిన తర్వాత ఎంత కష్టమైనా.. ఆ పాత్ర చేయాల్సిందే. అప్పుడే మన వృత్తికి న్యాయం చేసినట్లు. నా కెరీర్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు దీనికే కట్టుబడి ఉన్నాను.. అదే ఆచరిస్తున్నాను. నేను పడే కష్టంలో.. ఆ తర్వాత ప్రేక్షకులు, అభిమానులు కొట్టే క్లాప్స్, విజిల్స్ చూసుకుంటాను. అప్పుడు ఎంత బాధ అయినా అసలు బాధ అనే అనిపించదు. నేను ఇండస్ట్రీలోని వారందకీ ఇదే చెబుతున్నాను. పాత్ర కోసం ఎంతైనా కష్టపడండి. అలా కష్టపడని రోజు.. ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోండి. బెటర్ టు రిటైర్డ్.. అని చిరంజీవి చెప్పుకొచ్చారు.