2020, 2021 మొత్తం కరోనా తో కలం ఆకరిగిపోయి సినిమా ఇండస్ట్రీలు అన్నీ అతలాకుతలం అయ్యాయి. కరోనా క్రైసిస్ ఏ రంగం మీద ఎంత ప్రభావం చూపించిందో కానీ.. సినిమా ఇండస్ట్రీపై మాత్రం కోలుకోలేని దెబ్బ వేసింది. 2020 మార్చి 20 నుండి గత ఏడాది సెప్టెంబర్ వరకు కరోనా విలయతాండవంలో సినిమా ఇండస్ట్రీ చిగురుటాకులా వణికిపోయింది. ఇదే కరోనా తో ఎంతోమంది సినీ ప్రముఖులని కోల్పోయాము. అయితే గత ఏడాది చివరి నుండి సినిమా ఇండస్ట్రీ కోలుకోవడం మొదలు పెట్టింది. గత ఏడాది డిసెంబర్ లో పుష్ప పాన్ ఇండియా ఫిల్మ్, అఖండ ఈ ఏడాది ట్రిపుల్ ఆర్ పాన్ ఇండియా మూవీ, కెజిఎఫ్ 2, మేజర్, విక్రమ్, కాంతారా ఇవన్నీ సౌత్ ఇండస్ట్రీని మళ్ళీ నిలబెట్టాయి. నార్త్ ఇండస్ట్రీలో ప్లాప్ లు ఉన్నా ఈ ఏడాది చివరిలో దృశ్యం 2 కాస్త కోలుకునేలా చేసింది.
అయితే ఈఏడాది ఎలాగోగా సినిమా కష్టాలు తీరి కాస్త ఊపిరి తీసుకుంటున్న సమయంలో కరోనా కొత్త వేరియెంట్ మరోసారి సినిమా ఇండస్ట్రీకి టెన్షన్ వాతావరణాన్ని చూపిస్తుంది. ఒమిక్రాన్ BF7 కొత్త వేరియెంట్ ప్రస్తుతం ప్రపంచ దేశాలని వణికిస్తుంది. ఇప్పటికే చైనాలో కొత్త వేరియెంట్ కలకలం సృష్టిస్తుండగా.. ఇప్పుడు ఇండియాలోకి ఈ కొత్త కరోనా వేరియెంట్ ప్రవేశం అందరిని భయబ్రాంతులకు గురిచేస్తుంది. కేంద్రం కొత్తగా కరోనా గైడ్ లైన్స్ ని రాష్ట్రాలకు విడుదల చెయ్యడమే కాకుండా, ఎయిర్ పోర్టులలో కరోనా టెస్ట్ లు చెయ్యాలని, జనాభా ఎక్కువ ఉన్న చోటుకి మాస్క్ కంపల్సరీ చేసింది.
దానితో కరోనా BF7 వేరియెంట్ ప్రభావం సినిమా ఇండస్ట్రీపై మరోసారి పడబోతోంది అంటూ సినీ ఇండస్ట్రీలో గుబులు మొదలయ్యింది. సినిమా ఇండస్ట్రీలో కొత్త వేరియెంట్ ప్రభావంతో కొత్త టెన్షన్ స్టార్ట్ అయ్యింది. విడుదల కాబోయే సినిమాలు ఎలా వర్కౌట్ అవుతాయో అని గుబులు చెందుతున్నారు.