ఈ మధ్య అన్ని వుడ్‌లలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్.. ఇలా స్టార్ హీరోల సినిమాల నుంచి.. గతంలో భారీ విజయం సాధించిన చిత్రాలన్నింటినీ థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు. హీరోల పుట్టినరోజున.. లేదంటే ఏదో ఒక అకేషన్‌ను పురస్కరించుకుని.. వారి కెరీర్‌లోని మంచి సినిమాలను విడుదల చేస్తున్నారు. ఆ వచ్చిన వసూళ్లను ఏదో ఒక చారిటీకి ఉపయోగిస్తున్నారు. ఈ ప్రాసెస్‌లో ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ వంతొచ్చింది. డిసెంబర్ 12 రజనీకాంత్ పుట్టినరోజును పురస్కరించుకుని.. ఆయన ఫ్యాన్స్ సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారు.
రజనీ పుట్టినరోజు సందర్భంగా పీవీఆర్ సినిమాస్ ‘రజనీ సినిమా ఫెస్టివల్’ను ఈ నెల 15వ తేదీ వరకు చెన్నై, కోయంబత్తూరు నగరాల్లో నిర్వహిస్తుంది. ఈ ఫెస్టివల్‌లో రజనీకాంత్ నటించిన ‘బాబా’, ‘ది బాస్’, ‘2.0’, ‘దర్బార్’ వంటి చిత్రాలను ప్రదర్శించనున్నారు. ‘సూపర్‌స్టార్ రజనీకాంత్ బర్త్‌డే స్పెషల్ ఫిల్మ్ ఫెస్టివల్’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మొత్తం నాలుగు సినిమాలను రెండు నగరాల్లో ఈ నెల 15వ తేదీ వరకు ప్రదర్శించనున్నారు. ‘బాబా’ చిత్రాన్ని ఇప్పటికే అంటే శనివారం (డిసెంబరు 10) రీ-రిలీజ్ చేశారు. పాత వెర్షన్‌ను డిజిటలైజ్ చేసి విడుదల చేశారు. దీంతో రజనీకాంత్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. గతంలో తలైవర్ చిత్రాలు విదేశాల్లో సైతం మంచి కలెక్షన్లు రాబట్టాయి. ‘ముత్తు’ జపాన్ భాషలో రిలీజ్ చేయగా రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. ఇటీవల జపాన్ భాషలో విడుదలైన ‘ఆర్‌ఆర్‌ఆర్’ కూడా వసూళ్ళ వర్షం కురిపిస్తుంది. వీటిని స్పూర్తిగా తీసుకుని రజనీకాంత్ చిత్రాలను మాతృభాషతో పాటు జపాన్ వంటి ఇతర భాషల్లో రీరిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక రజనీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా ప్రదర్శించే సినిమాల థియేటర్లకు.. ప్రతి రోజు కొందరు గెస్ట్‌లు హాజరయ్యేలా ఫ్యాన్స్ ప్లాన్ చేసినట్లుగా సమాచారం.