గతంలో చెన్నై లో ఇండియన్ 2 షూటింగ్స్ స్పాట్ లో క్రేన్ ప్రమాదం జరగడంతో దర్శకుడు శంకర్ అసిస్టెంట్ డైరెక్టర్స్ తో పాటుగా మరోకొంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ వివాదంతో ఇండియన్ 2 షూటింగ్ చాలా రోజులు నిలిచిపోయింది. ఇలా షూటింగ్ సమయాల్లో ప్రమాదవశాత్తు కొంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. తాజాగా తమిళంలో ఓ సినిమా షూటింగ్ స్పాట్ లో ప్రమాదవశాత్తు స్టెంట్ మాస్టర్ మృతి చెందడం కలకలం రేపింది.
కోలీవుడ్ లో తెరకెక్కుతున్న విడుదలై సినిమా యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో భాగంగా స్టెంట్ మాస్టర్ సురేష్ తాడును పట్టుకుని వేలాడుతున్న సమయంలో కిందపడిపోయి తీవ్ర గాయాలపాలయినట్లుగా తెలుస్తుంది. ఆయన్ని వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించగా.. సురేష్ చికిత్స పొందుతూ మరణించడంతో కోలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాకయ్యింది. ప్రస్తుతం సురేష్ మృతి తో విడుదలై సినిమా షూటింగ్ నిలిచిపోయింది.