గత నెల అంటే నవంబర్ లో చిన్న చిన్న సినిమాలు బాక్సాఫీసు దగ్గర సందడి చేసాయి. అందులో అల్లు శిరీష్ ఉర్వశివో రాక్షసివో, సమంత యశోద, మాసూద చిత్రాలతో పాటు, డివైడ్ టాక్ తో గాలోడు, డబ్బింగ్ సినిమా లవ్ టుడే ప్రేక్షకులకి నచ్చాయి. అయితే ఆ సినిమాలన్నీ మొదటి వీకెండ్ కే ముగించేసాయి. ఆ తర్వాత వారమంతా ప్రేక్షకులు బోర్ ఫీలయ్యారు. పెద్ద సినిమా ఒక్కటీ లేదు, ఉత్సాహంగా కేరింతలు కొడుతూ థియేటర్స్ కి వెళ్లే ఆడియన్స్ కనిపించలేదు. బాలీవుడ్ నుండి తోడేలు వచ్చినా అంతగా పట్టించుకోలేదు.
నవంబర్ అంతా సో సో గా కనబడిన థియేటర్స్ రేపు రాబోయే శుక్రవారం మాత్రం కళకళలాడేలా ఉంది. ఎందుకంటే సక్సెస్ ఫుల్ హీరో అడివి శేష్ నుండి హిట్ అయిన హిట్ సీక్వెల్ హిట్ ద సెకండ్ కేస్ రాబోతుంది. హిట్ 2 అంటూ అడివి శేష్ హీరోయిన్ మీనాక్షి చౌదరి, నిర్మాత నాని ప్రమోషన్స్ తో హడావిడి చేస్తున్నారు. విశ్వక్ సేన్ తో హిట్ తో భారీ హిట్ కొట్టిన నాని దానికి సీక్వెల్ గా దర్శకుడు శైలేష్ కొలనునే కంటిన్యూ చేస్తూ హిట్ 2 చేసారు.
హిట్ కి మించి హిట్ 2 ఉండబోతుంది అంటూ ట్రైలర్ తోనూ, ప్రమోషన్స్ తోనూ అంచనాలు పెంచేశారు. ఈ సినిమా అయినా ప్రేక్షకులని వారం రోజుల పాటు థియేటర్స్ కి లాక్కోస్తుందేమో చూడాలి. ఇక ఈ సినిమాతో పాటు విష్ణు విశాల్ మట్టి కుస్తీ కూడా తెలుగులో, తమిళ్ లో విడుదల కాబోతుంది. ఈ సినిమాపై ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించడం లేదు.