రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న RC15 సినిమా ఆగిపోయిందంటూ ఈ మధ్య కొన్ని రూమర్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనికి కారణం కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ సినిమా మళ్లీ సెట్స్‌పైకి రావడమే. నెలలో 15 డేస్ కమల్ సినిమాకి, మరో 15 డేస్ చరణ్ సినిమాకి శంకర్ కేటాయిస్తూ.. రెండు సినిమాల షూటింగ్స్‌ని చేస్తున్నట్లుగా వార్తలు వచ్చినా.. ఈ రూమర్స్ ఆగడం లేదు. తాజాగా ఈ రూమర్లపై దిల్ రాజు రియాక్ట్ అయ్యారు.
‘‘ఇండియన్ 2 సినిమా హోల్డ్‌లో ఉండటంతో.. చరణ్-శంకర్ సినిమా విషయంలో ఓ ప్లాన్‌తో వెళ్లాం. బడ్జెట్, శంకర్ రెమ్యూనరేషన్ ఇలా అన్నీ ప్లాన్‌గా చేసుకుంటూ వెళుతున్నాం. మేకింగ్ విషయంలో ఆయన అస్సలు కాంప్రమైజ్ అవడు. ఇలా ప్లాన్‌గా వెళుతున్న సమయంలో.. సడెన్‌గా కమల్‌గారి ఇండియన్ 2 సినిమా ప్యారలల్‌గా షూటింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందువల్ల RC15 బడ్జెట్ మారిపోయింది.. సినిమా కూడా డిలే అవుతుంది. ఊహించని విధంగా ‘ఇండియన్ 2’ను శంకర్ చేయాల్సి రావడంతో.. RC15 బడ్జెట్ ఎక్కువైపోతుంది. అయితే ఇలాంటి పరిస్థితి వస్తే.. అనేది కూడా నేను, చరణ్ ముందే మాట్లాడుకున్నాం. చాలా మంది బయట రాంగ్ న్యూస్ మాట్లాడుకుంటున్నారు. శంకర్, ఇండియన్ 2 మాత్రమే చేస్తున్నాడని అనుకుంటున్నారు. మంత్‌లో.. ఆయన 12 రోజులు ‘ఇండియన్ 2’, మరో 12 రోజులు చరణ్ సినిమా షూటింగ్ చేస్తూ వస్తున్నారు. చరణ్-శంకర్ సినిమా షెడ్యూల్ ఎప్పుడూ ఆగలేదు. షూటింగ్ కంటిన్యూగా జరుగుతూనే ఉంది. ఇప్పుడు చరణ్ సినిమా న్యూజిలాండ్‌లో షూటింగ్ జరుగుతుంది. టీమ్ అంతా వెళ్లారు. 10 రోజులు అక్కడే ఉంటారు. ‘విక్రమ్’ హిట్ తర్వాత కమల్ హాసన్‌గారు, లైకా ప్రొడక్షన్స్ వారు సంప్రదింపులు జరుపుకోవడంతో.. ‘ఇండియన్ 2’ సినిమా స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. శంకర్‌గారు అడిగారు. నేను కూడా నిర్మాతనే. సినిమా నిర్మాణం ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి.. కాదనలేకపోయాను. చరణ్‌కి చెబితే.. తను కూడా ఓకే చెప్పాడు. మళ్లీ మా ప్లాన్ మార్చుకున్నాం..’’ అని RC15పై వస్తున్న రూమర్లకు దిల్ రాజు తెరదించారు.