‘కెజియఫ్’ తర్వాత కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి సంచలనం క్రియేట్ చేసిన సినిమా ‘కాంతార’. ఎక్కడ విడుదలైతే అక్కడ ఈ సినిమా సంచనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ ఏడాది దక్షిణాది హవాకి ఈ చిత్రం కూడా ప్రముఖ పాత్ర పోషించింది. దాదాపు రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి.. మేకర్స్‌కి భారీ లాభాలను అందించిన ‘కాంతార’ చిత్రం.. ఇప్పుడు ఓటీటీలో తన సత్తా చాటేందుకు రెడీ అయింది. మాములుగా ఈ సినిమా ఎప్పుడో ఓటీటీలో విడుదల కావాలి. అదిగో.. ఇదిగో అనేలా ఈ మధ్య వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇలా వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలోనే.. సడెన్‌గా ఓటీటీలో సినిమాని విడుదల చేసి అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చారు మేకర్స్.
నవంబర్ 24 అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిందీ మినహా ఇతర భాషలలో (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ) ఈ చిత్రాన్ని విడుదల చేశారు. మేకర్స్ నుంచి ఊహించని ఈ సర్‌ప్రైజ్‌కి అంతా షాకయ్యారు. ఎందుకంటే.. ఈ సినిమా కోసం ఓటీటీ యూజర్స్ ఎంతగానో వేచి చూస్తున్నారు. ఇప్పటికే రెండు మూడు డేట్స్ అనౌన్స్ చేసినా.. ఆ తేదీకి ఈ సినిమా స్ట్రీమింగ్ కాలేదు. ఎటువంటి హడావుడి లేకుండా వచ్చినా.. ఓటీటీలో ‘కాంతార’ ఎర్లీ మార్నింగ్ నుండే కుమ్ముడు స్టార్ట్ చేసినట్లుగా ప్రైమ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఓటీటీలోనూ ఈ చిత్రం రికార్డులు సృష్టించడం ఖాయం అనేలా వారి రిపోర్ట్స్ తెలుపుతున్నాయి. రిషబ్ శెట్టి హీరోగా నటించి, డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ‘కెజియఫ్’ బ్యానర్ హోంబలే ఫిలిమ్స్ నిర్మించింది.