2023 సంక్రాంతికి విడుదల కాబోయే చిత్రాలలో స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలయ్య చిత్రాలు ఉండటంతో.. తమిళ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో విజయ్ చిత్రానికి థియేటర్ల విషయంలో ఇష్యూ నడుస్తోంది. ఈ తమిళ చిత్రానికి నిర్మాత, దర్శకుడు టాలీవుడ్‌కి చెందిన వాళ్లు కావడంతో.. ఈ ఇష్యూ, కాంట్రవర్సీగా మారింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నిర్మాత దిల్ రాజు ‘వారసుడు’ చిత్రాన్ని నిర్మించారు. అయితే టాలీవుడ్ పరంగా ఎక్కువ శాతం థియేటర్లు దిల్ రాజు గుప్పిట్లో ఉండటంతో.. టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాలకు ఎక్కడ థియేటర్ల కొరత ఏర్పడుతుందో అని చెప్పి.. తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ముందు జాగ్రత్తగా.. పండుగకి విడుదలయ్యే చిత్రాల విషయంలో స్ట్రయిట్ సినిమాలకు ఎక్కువ థియేటర్లు కేటాయించాలని కోరింది. ఇప్పుడదే పెద్ద వివాదంగా మారింది.
అసలు వేరే ఇండస్ట్రీ సినిమాలకు థియేటర్లు ఇవ్వకూడదనే నిర్ణయం కరెక్ట్ కాదంటూ.. నిర్మాతల మండలి విజ్ఞప్తిని కొందరు తప్పుగా భావించారు. దీంతో వారి ప్రకటనను వెనక్కి తీసుకోవాలంటూ టాలీవుడ్, కోలీవుడ్‌కి చెందిన కొందరు దర్శకనిర్మాతలు ఓపెన్ స్టేట్‌మెంట్స్ ఇచ్చేశారు. ఈ వివాదంపై కోలీవుడ్ దర్శకనిర్మాతలంతా ఒకచోటకి చేరి చర్చలు జరిపి.. సమస్యని సానుకూలంగా పరిష్కరించినట్లుగా తెలుస్తుంది. విజయ్ ‘వారసుడు’ సినిమా తెలుగులో విడుదలకు ఎలాంటి చిక్కులు ఉండవని తమిళ చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు తేనండల్ మురళి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై తెలుగు సినీ నిర్మాతల సంఘంతో చర్చలు జరిపామని, వారంతా సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. అందువల్ల ‘వారసుడు’ చిత్రం తెలుగులో విడుదలయ్యేందుకు ఎలాంటి చిక్కులు ఉండవన్నారు. దీంతో పెద్ద వివాదం అయితే ముగిసింది కానీ.. విడుదల సమయంలో థియేటర్ల కేటాయింపు ఎలా ఉంటుందనేదే ఇప్పుడాసక్తికరంగా మారింది.