టాలీవుడ్, కోలీవుడ్ మధ్య సంక్రాంతికి విడుదల కాబోయే సినిమాల విషయంలో పెద్ద వివాదమే చెలరేగుతోంది. తమిళ స్టార్ హీరో విజయ్‌తో నిర్మాత దిల్ రాజు నిర్మించిన ‘వారసుడు’ సినిమా విషయంలోనే ఈ వివాదమంతా. ఈ సినిమా మొదట తెలుగు, తమిళ్.. రెండు భాషల్లో నిర్మిస్తున్నామని చెప్పారు. తర్వాత తెలుగు సినిమాల షూటింగ్స్ బంద్ సమయంలో.. తనది తెలుగు సినిమా కాదని ‘వారసుడు’ సినిమా షూటింగ్‌ని దిల్ రాజు ఆపలేదు. దీంతో ఇది డబ్బింగ్ సినిమాగా తెలుగులో విడుదలకానుందనే విషయాన్ని వెల్లడించారు. అయితే టాలీవుడ్‌లో ఎక్కువ థియేటర్లు దిల్ రాజు హ్యాండ్‌లో ఉండటంతో.. రేపు సంక్రాంతికి తన ‘వారసుడు’ సినిమాకు అత్యధిక థియేటర్లను ఆయన బ్లాక్ చేస్తున్నట్లుగా వార్తలు వైరల్ అవుతుండటంతో.. దీనిపై తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి.. అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేసింది.
గతంలో దిల్ రాజు చెప్పినట్లుగా సంక్రాంతి, దసరా వంటి పండుగలకు ముందు స్ట్రయిట్ చిత్రాలకు, తర్వాత డబ్బింగ్ చిత్రాలకు మాత్రమే థియేటర్లు కేటాయించాలని కోరింది. దీనినే ఇప్పుడు పెద్ద వివాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి విడుదల చేసిన ప్రకటనలో.. పండగల సమయంలో డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు ఇవ్వవద్దు అని ఎక్కడా అనలేదు. టాలీవుడ్ చిత్రాలకు ప్రయారిటీ ఇవ్వమని మాత్రమే కోరారు. దీనికి తమిళ దర్శకనిర్మాతలను రెచ్చగొట్టి.. రెండు ఇండస్ట్రీల మధ్య చిచ్చుపెట్టాలని కొందరు ప్రయత్నిస్తుండటం విశేషం. తెలుగు సినిమాలను మేం ఆదరిస్తుంటే.. మా సినిమాలను ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారంటూ.. అక్కడి దర్శకనిర్మాతలు ఈ ఇష్యూపై ఈనెల 22వ తేదీన సమావేశమై చర్చలు జరపబోతున్నట్లుగా తెలుస్తోంది. తెలుగైనా, తమిళ్ అయినా.. ఇప్పుడు సినిమా అనేది పాన్ ఇండియా రేంజ్‌కి చేరుకుంది. ఇలాంటి సమయంలో.. కూర్చుని మాట్లాడుకుంటే సెట్ అయిపోయే విషయాన్ని.. ఇండస్ట్రీల మధ్య చిచ్చు పెట్టుకునే స్థాయికి తీసుకెళ్లడం అనేది ప్రమాదకరమైన వాతావరణాన్ని సూచిస్తుంది.
అయితే.. తమిళ దర్శకనిర్మాతలకి, అలాగే ఈ ఇష్యూని ఇండస్ట్రీల ఫైట్‌గా చిత్రీకరించాలని చూసేవారికి ఒక్కటే ప్రశ్న.. కోలీవుడ్‌లో సంక్రాంతికి లేదా ఏదైనా పండగకి రజనీకాంత్, అజిత్, విజయ్ వంటి హీరోల చిత్రాలు విడుదలవుతున్నప్పుడు.. టాలీవుడ్ నుండి విడుదలయ్యే చిత్రాలకు అక్కడ ఎన్ని థియేటర్లు కేటాయిస్తున్నారు? దీనికి సమాధానం చెప్పండి ఫస్ట్. అంతేకానీ, ఏ సినిమానైనా ఆదరించే గుణం తెలుగు ప్రేక్షకులకు ఉంది కదా.. అని వారిని వెర్రిపప్పలుగా చూడకండి. ఎవరిని ఎక్కడ పెట్టాలో.. ఎలా పెట్టాలో వారికి బాగా తెలుసు. ఏమంటారు తెలుగు ఆడియన్స్?