తెలుగు సినిమాల మధ్యలో తమిళ సినిమాలు విడుదల చెయ్యరాదు, అందులోను తెలుగు పండుగ సంక్రాంతి టైం లో తమిళ డబ్బింగ్ సినిమాలు విడుదల చెయ్యకూడదు అంటూ దిల్ రాజు తెలుగు, తమిళ్ లో నిర్మిస్తున్న వారసుడు సినిమాని అడ్డుకుంటూ తెలుగు నిర్మాతల మండలి లేఖ విడుదల చేసింది. దాని ప్రకారం ఏ డబ్బింగ్ మూవీ కూడా సంక్రాంతికి తెలుగు సినిమాల మీద పోటీగా విడుదల చెయ్యకూడదని చెప్పారు. అయితే ఈ లేఖ పై తమిళ దర్శకనిర్మాతలు మండిపడుతున్నారు. తెలుగు సినిమాలని ఎప్పుడు బడితే అప్పుడు విడుదల చేసుకునే స్వేచ్ఛ తమిళంలో ఉంది.
కానీ మా సినిమాలను విడుదల చెయ్యకూడదు అనడానికి మీరెవరు, అలా అయితే తెలుగు సినిమాల్నీ తమిళంలో విడుదల కాకూండా అడ్డుకుంటామంటూ వారు రెచ్చిపోతున్నారు. దానితో వారసుడు రిలీజ్ వివాదం ముదిరి పాకాన పడింది. తమిళ దర్శకుడు సీమాన్ మాట్లాడుతూ తెలుగు సినిమాలని తమిళనాట విడుదల కానివ్వకుండా అడ్డుకుంటామని అన్నారు. అయితే తెలుగు బడా నిర్మాత అల్లు అరవింద్ ఈ తమిళ, తెలుగు సినిమాల విడుదల వివాదంపై స్పందిస్తూ సినిమాలకు ఎల్లలు లేవు, ఎల్లలు చెరిపేసాం, సినిమాలని ఎక్కడైనా ఎప్పుడైనా విడుదల చెయ్యొచ్చు, సినిమాలను విడుదల కాకుండా అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు. తెలుగు సినిమా పరిశ్రమ అందరిది.
ఇప్పుడు సౌత్ సినిమా కోసం ప్రపంచం ఎదురు చూస్తుంది. సౌత్ నార్త్ అన్న తేడా లేదు, ఏ సినిమా ఎక్కడైనా విడుదల చెయ్యొచ్చు, సినిమా బావుంటే అదే ఆడుతుంది అంటూ అరవింద్ స్పందించగా.. తెలుగు సినిమాల విడుదల విషయంలో తమిళ దర్శకనిర్మాతలు ఈ నెల 22 న మీటింగ్ పెట్టి చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది.