యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు కమర్షియల్ హీరోగా గుర్తింపు, అదే స్థాయిలో హిట్‌ను తీసుకొచ్చిన సినిమా ‘స్టూడెంట్ నెం.1’. ఈ సినిమాకు ముందు ఎన్టీఆర్‌కు బాలనటుడిగా రెండు చిత్రాలు, హీరోగా ఒక చిత్రం చేసిన అనుభవం మాత్రమే ఉంది. ‘స్టూడెంట్ నెం.1’ చిత్రం మాత్రం ఎన్టీఆర్‌లోని అన్ని కోణాలను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈ సినిమాతోనే దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమాని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, భారీ చిత్రాల నిర్మాత సి. అశ్వనీదత్ నిర్మించారు. ఈ సినిమాలోని పాటలు పెద్ద హిట్టవడమే కాకుండా.. ఇప్పటికీ అక్కడక్కడా వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి నిర్మాత అశ్వనీదత్ ఓ ఆసక్తికర విషయాన్ని రివీల్ చేశారు.
బుల్లితెరపై అలీ హోస్ట్‌గా చేస్తున్న ఓ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత అశ్వనీదత్.. ఈ సినిమాకు మొదట హీరోగా ప్రభాస్‌ని అనుకున్నామని తెలిపారు. ‘రాజకుమారుడు’తో మహేష్ బాబు, ‘చిరుత’తో రామ్ చరణ్, ‘గంగోత్రి’తో అల్లు అర్జున్‌లని హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన అశ్వనీదత్.. ‘స్టూడెంట్ నెం 1’ చిత్రంతో ప్రభాస్‌ని పరిచయం చేయాలని అనుకున్నామని తెలిపారు. కానీ హరికృష్ణగారు ఫోన్ చేయడంతో.. చివరికి ఆ సినిమా తారక్‌కి వచ్చిందంటూ అశ్వనీదత్ చెబుతున్న వీడియోని నెటిజన్లు కొందరు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. నిజంగా ప్రభాస్ ఆ సినిమా చేసి ఉంటే ఎలా ఉండేదో.. అంటూ వారు కామెంట్స్ చేస్తుండటం విశేషం. 2001లో వచ్చిన ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సిన ప్రభాస్.. ఆ సినిమా తారక్ చేయడంతో.. 2002లో ‘ఈశ్వర్’ చిత్రంతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇప్పుడు తిరుగులేని పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.